ఆశ్రయం నుంచి ఆత్మీయుల చెంతకు.. | - | Sakshi
Sakshi News home page

ఆశ్రయం నుంచి ఆత్మీయుల చెంతకు..

Oct 4 2026 8:08 AM | Updated on Oct 4 2026 8:08 AM

రెండున్నర నెలలుగా కుటుంబానికి దూరం

అక్కున చేర్చుకున్న స్మైల్‌ ప్రాజెక్ట్‌ నిర్వాహకులు

కోల్‌సిటీ: ఒకప్పుడు రైల్వేలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేసిన చిలుముల శంకర్‌(40).. కొంతకాలంగా మానసిక సమస్యతో బాధపడుతూ కుటుంబానికి దూరమయ్యాడు. రోడ్ల పక్కన నిద్రిస్తూ, యాచించగా వచ్చిన డబ్బులతో మద్యం తాగుతూ, ఆకలి తీర్చుకుంటూ దీనస్థితిలో జీవనం సాగించాడు. అలాంటి సమయంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన స్మైల్‌ ప్రాజెక్ట్‌ ప్రతినిధులు చేరదీసి ఆశ్రయం కల్పించడంతో అతడి జీవితంలో మార్పు వచ్చింది. రెండున్నర నెలల అనంతరం శనివారం శంకర్‌ తిరిగి కుటుంబ సభ్యులను చేరుకున్నాడు.

స్మైల్‌ ప్రాజెక్ట్‌ చేయూత..

పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ శాలపల్లి రోడ్డుపై దుమ్ముపట్టిన దుస్తులు, మాసినగడ్డం, పెరిగిన జుట్టుతో దీనస్థితిలో ఉన్న శంకర్‌ను రెండున్నర నెలల క్రితం స్మైల్‌ ప్రాజెక్ట్‌ ప్రతినిధి నూనె శరత్‌మోహన్‌ గుర్తించారు. వెంటనే స్మైల్‌ ప్రాజెక్ట్‌ ఆశ్రయ గృహానికి తరలించారు. మూడుపూటల భోజనం పెడుతూ, ఉచితంగా వైద్యం, వసతి కల్పిస్తూ బాగోగులు చూసుకున్నారు. దీంతో శంకర్‌ మద్యపానంనాన్ని మానివేశాడు. క్రమశిక్షణతో ఉంటూ ఆశ్రమంలో తనకు చేతనైన పనులు చేసుకోవడం ప్రారంభించాడు. అతడి ప్రవర్తనలో సానుకూల మార్పు కనిపించింది.

ఆత్మీయుల చెంతకు శంకర్‌

ఆశ్రమంలో ఉంటున్న శంకర్‌ సమాచారం తెలుసుకున్న తల్లి చిలుముల లక్ష్మి, సోదరుడు సుధాకర్‌ శనివారం స్మైల్‌ ప్రాజెక్ట్‌ ఆశ్రయ గృహానికి చేరుకున్నారు. శంకర్‌లో వచ్చిన మార్పు చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ ఆశ్రయం కల్పించి, భోజనం, వసతి అందించడంతోపాటు జీవితాన్ని చక్కదిద్దుకునేలా అండగా నిలిచిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. శంకర్‌ను సంతోషంగా తమ వెంట ఇంటికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు నూనె లతామోహన్‌, నూనె శరత్‌మోహన్‌, స్మైల్‌ ప్రాజెక్ట్‌ సిబ్బంది చెలికాని రమేశ్‌, కవిత, నూనె మమత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement