జగిత్యాలక్రైం: సారంగాపూర్ మండలకేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న జగిత్యాల పట్టణంలోని వాణీనగర్‌కు చెందిన ఫణి చంద్రశేఖర్‌పై దాడిచేసిన సారంగాపూర్‌కు చెందిన పల్లపు రాజును శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై గీత తెలిపారు. రాజు సబ్‌స్టేషన్‌లోకి ప్రవేశించి చంద్రశేఖర్‌ను కుర్చీతో కొట్టడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో అతడిని 108లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాజు కొద్దిరోజులుగా సబ్‌స్టేషన్‌లో చెత్త వేస్తున్నాడని, రాత్రి సమయంలో ఫోన్ మాట్లాడుతూ సిబ్బంది విధులకు ఆటంకం కలిగిస్తున్నాడని, అడిగితే చంపుతానని బెదిరిస్తున్నాడని చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
నిందితుడిపై చర్యలు తీసుకోండి
విధినిర్వహణలో ఉన్న విద్యుత్ ఉద్యోగిపై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘ నాయకులు శనివారం ఎస్పీ అశోక్‌కుమార్‌ను కలిసి విన్నవించారు. ఏఎన్‌టీయూసీ జిల్లా కార్యదర్శి నూనావత్ రాంజీ తదితరులు ఉన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కోరారు.


