పెద్దపల్లి: బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన బీసీ సదస్సు రసాభాసగా మారింది. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీఎల్ రమణ, గీత పారిశ్రామిక సహకార సంఘం కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్, ఓయూ జేఏసీ మాజీ చైర్మన్ బాలరాజు యాదవ్ సమక్షంలోనే ఘర్షణ చోటుచేసుకుంది. నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీపీ గంట రాములు యాదవ్, బీసీ జేఏసీ జిల్లా చైర్‌పర్సన్ దాసరి ఉషను ఆ హ్వానించలేదని వారి మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నినాదాలు చేస్తూ వేదిక వద్దకు దూసుకు రావడంతో ఇరువర్గాల మధ్య వాగ్వా దం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే ఫోన్‌చే సి, వాయిస్ మెసేజ్ పంపినట్లు చెప్పినా పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో ఇరువర్గాలు కుర్చీ లతో పరస్పరం దాడులకు దిగాయి. ఈ ఘటనలో కుర్చీలు విరిగిపోయాయి. కొందరు నాయకులు, కార్యకర్తలు ఫంక్షన్‌హాల్ నుంచి రహదారి వరకు పరస్పరం దాడులు చేసుకుంటూ వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. గంట రాములు యాదవ్, దాసరి ఉష, నాగరాజు, రవి తదితరులను సదస్సుకు ఆహ్వానించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఒంటెద్దు పోకడల వల్లే నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి దెబ్బతింటోందని ఆరోపించారు. బీసీలను విస్మరించడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని, రాష్ట్రంలో అన్నిపార్టీలు బీసీ వాదాన్ని వినిపిస్తున్న సమయంలో పెద్దపల్లిలో బీసీలను అవమానించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానం ఇప్పటికై నా స్పందించి పరిస్థితిని చక్కదిద్దాలని కోరారు. జరిగిన విషయాన్ని అధిష్టాన వర్గం దృష్టికి తీసుకువెళ్తామని, ఓపిక అవసరమని పలువురు నాయకులు సముదాయించారు.
కుర్చీలతో పరస్పర దాడులు


