ఆర్‌ఎఫ్‌సీఎల్‌ను వెంటాడుతున్న సమస్యలు ప్రారంభం నుంచి 72సార్లు నిలిచిన యూరియా ఉత్పత్తి తరచూ మరమ్మతులతో పెరుగుతున్న నిర్వహణ భారం
సాక్షి పెద్దపల్లి/ఫెర్టిలైజర్‌సిటీ:
రామగుండం ఫెర్టిలైజర్స్, కెమికల్స్ లిమిటెడ్(ఆర్‌ఎఫ్‌సీఎల్) ప్లాంట్ లీకేజీలు, సాంకేతిక వైఫల్యాలు, మరమ్మతులతో తరచూ నిలిచిపోతోంది. ప్లాంట్ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించిన 2021 మార్చి 22 నుంచి ఇప్పటివరకు సుమారు 72సార్లు యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. రోజూ 3,850 మెట్రిక్ టన్నుల యూరియా, 2,200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న కర్మాగారంలో పదేపదే లీకేజీలు ఎందుకు వస్తున్నాయి?మరమ్మతు చేస్తున్నా సమస్య ఎందుకు పునరావృతమవుతోంది. యూరియా ఉత్పత్తి నష్టంతోపాటు మరమ్మతుల రూపంలో ప్లాంట్‌పై ఆర్థికభారం ఎంత పడుతోంది? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
● మరమ్మతులకే అదనపు వ్యయం
ప్లాంట్‌లో తరచూ చేపట్టే మరమ్మతు కోసం ఎంతమొత్తం వెచ్చిస్తున్నారని పరస్తుతం చర్చ మొదలైంది. యంత్రపరికరాల మరమ్మతు, విడిభాగాల కొనుగోలు, సాంకేతిక నిర్వహణకు వెచ్చించే ఖర్చుతోపాటు ఉత్పత్తి నిలిచిపోవడంతో కలిగే నష్టాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
● 2025–26లో 114 రోజుల పాటు అంతరాయం
2025–26 ఆర్థిక సంవత్సరంలోనే కర్మాగారం ఐదుసార్లు నిలిచిపోయింది. 114 రోజుల పాటు యూరియా ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. 12.70 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకోగా.. సుమారు 8.57 లక్షల టన్నులే ఉత్పత్తి అయ్యింది. నిర్దేశిత లక్ష్యంలో దాదాపు 4.13 లక్షల టన్నుల ఉత్పత్తి తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ సమస్యలు పూర్తిగా తొలగిపోలేదని తెలుస్తోంది. తొలి ఐదునెలల్లో సుమారు 5.30 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తికి దాదాపు 4.50 లక్షల టన్నులే ఉత్పత్తి అయినట్లు సమాచారం.
● సరఫరాపై ప్రభావం
మనరాష్ట్రానికి యూరియా సరఫరా చేయడంలో ఆర్‌ఎఫ్‌సీఎల్ కీలకపాత్ర పోషిస్తోంది. కర్మాగారంలో ఉత్పత్తి చేసే యూరియాలో 50 శాతం తెలంగాణకు కేటాయిస్తారు. మిగిలిన మొత్తాన్ని ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. ఉత్పత్తి నిలిచిపోతే మనతోపాటు పొరుగు రాష్ట్రాలపైనా ప్రభావం పడుతోంది.
ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్లాంట్
నాణ్యత లోపాలే
కారణమా?
ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో తరచూ పైపులైన్లు ఎందుకు లీకవుతున్నాయనేది ప్రధాన ప్రశ్నగా మారింది. నిర్మాణ సమయంలో ఉపయోగించిన పై పుల నాణ్యత ఎలా ఉంది? వెల్డింగ్ పనులు నిర్దేశిత ప్రమాణాల ప్రకారం జరిగాయా? పై పుల మందం, లోహ నాణ్యత, పీడన పరీక్షలు సక్రమంగా నిర్వహించారా? పరికరాల అమరికలో నాణ్యతా ప్రమాణాలు పాటించారా? అ నే అంశాలపై సమగ్ర సాంకేతిక పరిశీలన అవసరమనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. కార్మిక సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు నిర్మాణ దశలోనే నాణ్యతా ప్రమాణాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
శాశ్వత పరిష్కారం ఎప్పుడు?
ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో సమస్య తలెత్తిన ప్రతీసారి మరమ్మతు చేసి ఉత్పత్తిని పునరుద్ధరించడం కంటే.. లీకేజీలు, పరికరాల వైఫల్యాలకు మూలకారణాలను గుర్తించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు చోటుచేసుకున్న 72 అంతరాయాలకు కారణాలు, మరమ్మతుల వ్యయం, ఉత్పత్తినష్టం, పునరావృతమైన సమస్యలపై సమగ్ర ఆడిట్ నిర్వహిస్తే వాస్తవ పరిస్థితి స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం స్వతంత్ర సాంకేతిక దర్యాప్తు చేపట్టాలనే డిమాండ్లు బలపడుతున్నాయి.
సీబీఐతో విచారణ జరపాలి
పరికరాల కొనుగోలు, పైపుల నాణ్యత, ప్లాంట్ నిర్మాణంలో లోపాలతోనే తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇందులోని అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
– నెలకంటి రాము, అధ్యక్షుడు, ఆర్‌ఎఫ్‌సీఎల్ అలైడ్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం


