అక్షరమే అండ.. ఆత్మవిశ్వాసమే ఆలంబన | - | Sakshi
Sakshi News home page

అక్షరమే అండ.. ఆత్మవిశ్వాసమే ఆలంబన

Oct 2 2026 5:32 AM | Updated on Oct 2 2026 5:32 AM

● ‘అక్షర ఉల్లాస్‌’తో మహిళల జీవితాల్లో వెలుగులు

పెద్దపల్లి: ఇన్నాళ్లూ ఇంటి పనులకే పరిమితమైన మహిళలు.. ఇప్పుడు పుస్తకాలు పట్టి అక్షరాలు దిద్దుతున్నారు. చదవడం, రాయడంతోపాటు బ్యాంకు లావాదేవీలు, డిజిటల్‌ చెల్లింపులు, ఫోన్‌ వినియోగంలోనూ స్వావలబన సాధించారు. మహిళల్లో అక్షరాస్యత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు చేపట్టిన శ్రీఅక్షర ఉల్లాస్‌శ్రీ కార్యక్రమం జిల్లాలో సత్ఫలితాలు ఇస్తోంది.

అక్షరాస్యతతో సాధికారత

మహిళలకు ప్రాథమికంగా చదువు, రాతతోపాటు దైనందిన జీవితంలో అవసరమైన ఆర్థిక, డిజిటల్‌ పరిజ్ఞానాన్ని అందుకుంటున్నారు. సంతకం చేయడం, బ్యాంకు ఫారాలు నింపడం, ఫోన్‌పే, గూగుల్‌పే వంటి డిజిటల్‌ చెల్లింపుల యాప్‌లను వినియోగించేలా అధికారులు శిక్షణ ఇస్తున్నారు.

ఎస్‌హెచ్‌జీల భాగస్వామ్యం

స్వయం సహాయక సంఘాల సభ్యులను భాగస్వాములను చేస్తూ అక్షరాస్యత తరగతులు నిర్వహిస్తున్నారు. పనులు ముగించుకున్న తర్వాత సాయంత్రం వేళల్లో స్థానిక పాఠశాలలు, సమాజ భవనాల్లో మహిళలు తరగతులకు హాజరవుతున్నారు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన ట్యూటర్లు సులభ పద్ధతుల్లో అక్షరాలు నేర్పిస్తున్నారు.

మా పేరు మేమే రాసుకుంటున్నాం

ఇన్నాళ్లూ బ్యాంకులో డిపాజిట్‌ ఫారం నింపాలన్నా, బస్సు బోర్డు చదవాలన్నా ఇతరులపై ఆధారపడేవాళ్లమని మహిళలు చెప్పారు. ఇప్పుడు తమ పేరు తామే రాసుకోగలుగుతున్నామని పేర్కొన్నారు. అక్షరం నేర్చుకోవడం కొత్త ఉత్సాహం, నమ్మకాన్ని ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇంటింటా అక్షర వెలుగులు

ఒక మహిళ అక్షరాస్యురాలైతే ఆ ప్రభావం కుటుంబంపై పడుతుంది. పిల్లల చదువుపై శ్రద్ధ పెరగడంతోపాటు ఆర్థిక వ్యవహారాల్లోనూ మహిళలు స్వయంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇందుకోసం అక్షర ఉల్లాస్‌ కార్యక్రమం మహిళల జీవితాల్లో అక్షర వెలుగులు నింపుతూ సాధికారతకు బాటలు వేస్తోంది.

అక్షరాస్యులను చేయడమే లక్ష్యం

నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయడం లక్ష్యంగా మహిళా స్వశక్తి సంఘాలు పనిచేస్తున్నాయి. నిరక్షరాస్యులకు శిక్షణ ఇచ్చి అనంతరం పరీక్షలు రాయించడంతో మెజార్టీ మహిళా సంఘాల సభ్యులు ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేలా ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్తున్నాం.

– రవీందర్‌, అదనపు డీఆర్డీవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement