వడ్డించారు.. తిన్నారు | - | Sakshi
Sakshi News home page

వడ్డించారు.. తిన్నారు

Oct 2 2026 5:32 AM | Updated on Oct 2 2026 5:32 AM

● జెడ్పీ హైస్కూల్‌లో అల్పాహారం పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే ఠాకూర్‌

రామగుండం: ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకం ద్వారా పేద విద్యార్థులకు ఇంజినీరింగ్‌ విద్యను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డికే దక్కిందని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. కులమతాలు, ఆర్థిక పరిస్థితులకు అతీతంగా ప్రతీపేద విద్యార్థి ఉన్నత శిఖరాలు చేరుకోవాలనేదే వైఎస్సార్‌ లక్ష్యమని, ఇందుకోసమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ప్రవేశపెట్టి తొలిబీజం వేశారన్నారు. విద్యార్థులు ఖాళీ కడుపుతో ప్రభ్వుత పాఠశాలలకు రావొద్దనే ఉద్దేశంతో ప్రస్తుత కాంగ్రెస్‌ సర్కార్‌ రుచికరమైన అల్పాహారం అందించే లక్ష్యంతో హరేరామ.. హరేకృష్ణ సహకారంతో అల్పాహార పథకం ప్రారంభించిందన్నారు. స్థానిక జెడ్పీ హైస్కూల్‌లో గురువారం తొలుత విద్యార్థులతో కలిసి అల్పాహారం తిన్నారు. తర్వాత విద్యార్థులకు వడ్డించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నారని, ఇందుకోసం విదేశీ విద్యావిధానంపై అధ్యయనం చేసేందుకు కొందరు ఉపాధ్యాయులను విదేశాలకు పంపించారని గుర్తుచేశారు. శ్రీప్రైవేట్‌ స్కూళ్లకు పంపకండి.. ప్రభుత్వ స్కూళ్లకు పంపండి.. మేధావులుగా తీర్చిదిద్దండిశ్రీ అని తల్లిదండ్రులకు ఎమ్మెల్యే సూచించారు. అల్పాహారం, మధ్యాహ్న భోజనం, స్నాక్స్‌, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అందిస్తోందని అన్నారు. తాను ఇదేస్కూల్‌లో చదివిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అప్పట్లో ప్రతీ ఒక్కరు ప్రభుత్వ పాఠశాలలోనే చదివించేవారని, ఇప్పుడు ప్రైవేట్‌ స్కూళ్లలో చదివించడం స్టేటస్‌గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏటీసీ, ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు ఏర్పాటవుతున్నాయని, హైస్కూల్‌ను సైతం తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌గా అప్‌గ్రేడ్‌ చేస్తున్నారని తెలిపారు. మేయర్‌ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్‌ పాతిపెల్లి ఎల్లయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ అరుణశ్రీ, కార్పొరేటర్లు సిరిశెట్టి సతీశ్‌గౌడ్‌, ఇసంపెల్లి అంజయ్య, దారంగుల కుమార్‌, అయేషాఖానం, బదావత్‌ నర్సమ్మ, కాంగ్రెస్‌ కార్పొరేషన్‌ అధ్యక్షుడు ఎండీ ముస్తాఫా, పట్టణ అధ్యక్షుడు ఈదునూరి హరిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యాధికారుల తీరుపై అసహనం

తొలిరోజు అల్పాహార పంపిణీ పథకంలో ప్రతీ విద్యార్థి తల్లిదండ్రులతో హాజరయ్యేలా చూడాలని చెప్పినా ఒక్క పేరెంట్‌ కూడా హాజరు కాకపోవడంపై ఎమ్మెల్యేతోపాటు మేయర్‌.. డీఈవో శారద, ఎంఈవో మల్లేశం, హెచ్‌ఎం శారదపై అసహనం వ్యక్తం చేశారు. రూ.కోట్లు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్న విషయాన్ని వివరించాలనే ఉద్దేశంతోనే తల్లిదండ్రులను ఆహ్వానించాలని సూచించామని, ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని నిలదీశారు. డీఈవో, ఎంఈవో, హెచ్‌ఎంలను ‘సాక్షి’ వివరణ కోరగా.. తాము ప్రతీ పేరెంట్‌కు సమాచారం ఇచ్చామని, వివిధ కారణాలతో రాలేదని, ఇందులో తమ తప్పిదమేమీ లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement