పెద్దపల్లి: పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. జిల్లాలో విద్యా ప్రమాణాల మెరుగు, పాఠశాలల పర్యవేక్షణపై కలెక్టరెట్‌లో గురువారం సమీక్షించారు. విద్యార్థుల్లో అభ్యాసన లోపాలను గుర్తించి, సరిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా విద్యాశాఖ అధికారి శారద తదితరులు పాల్గొన్నారు.
ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రావాలి
పెద్దపల్లిరూరల్: ఇళ్లు, ఖాళీ స్థలాల్లో పీఎం సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేందుకు జిల్లావాసులు ముందుకు రావాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు. సేవాసేతు అభియాన్ ద్వారా గురువారం నుంచి మూడు రోజులపాటు నిర్వహించే సదస్సును జిల్లా కేంద్రంలో ఆయన ప్రారంభించి మాట్లాడారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునేందుకు ముందుకొచ్చే వారు వెంటనే తమపేర్లను నమోదు చేసుకునేందుకు సదస్సులు దోహదపడతాయని తెలిపారు. ఎన్పీడీసీఎల్, రెడ్‌కో, బ్యాంకర్లు, సోలార్ వెండర్లు అంతా ఒకేచోట ఉండడంతో పేర్ల నమోదుతోపాటు ఏర్పాటు ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని ఆయన అన్నారు. ఎస్‌ఈ గంగాధర్, డీఈఈ బాలయ్య, రాజబ్రహ్మచారి, మల్లేశం, లీడ్‌బ్యాంకు మేనేజర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
ఆకెనపల్లిలో కలెక్టర్ పర్యటన
రామగుండం: అంతర్గాం మండలం ఆకెనపల్లిలో కొనసాగుతున్న భూసర్వే ప్రక్రియను కలెక్టర్ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులు, భూస్వాముల అపోహలు నివృత్తి చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గాదె స్రవంతి, తహసీల్దార్ ప్రసాదరావు, సర్వేయర్ లలిత, రెవెన్యూ పరిశీలకుడు రమేశ్, జీపీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.


