జిల్లాలో సర్ పక్రియ ఇలా..
ఆగస్టు 3తో ముగియనున్న ‘సర్’ గడువు
పట్టణాల్లో మందగించిన ప్రక్రియ
జిల్లాలో 85.44 శాతం డిజిటలైజేషన్ పూర్తి
మంథని, పెద్దపల్లి ముందంజ.. రామగుండం వెనుకంజ
అసెంబ్లీ వారీగా..
సొంతూరికే మొగ్గు
సాక్షి,పెద్దపల్లి: జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువు ఆగస్టు 3తో ముగియనున్న నేపథ్యంలో మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆశాజనకంగా కొనసాగుతున్నప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో మందకొడిగా సాగుతుండటం అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో మొత్తం 7,12,157 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 6,08,470 మంది వివరాల డిజిటలైజేషన్ (85.44శాతం) పూర్తయింది. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే మంథని, పెద్దపల్లి ప్రాంతాలు ముందంజలో ఉండగా, రామగుండం నియోజకవర్గం వెనుకబాటులో ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. నిర్ధేశిత సమయంలోగా డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తమవుతుందా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, మొత్తం ఓటర్లలో 50వేల నుంచి లక్ష వరకు ఓట్లు తగ్గే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది.
బోగస్ ఓట్లపై ప్రత్యేక దృష్టి
జిల్లాలో 100శాతం ఎన్యూమరేషన్ ఫారాంల పంపిణీ పూర్తి కావటంతో డిజిటలైజేషన్ ప్రక్రియలో వేగం పెంచారు. ఇప్పటివరకు 13,074 మంది మృతుల పేర్లపై ఉన్న ఓట్లు, 28,166 మంది ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్లు, 14,138 డబుల్ ఓట్లు, 396 మంది అందుబాటులో లేని ఓటర్లను గుర్తించారు. వీరి వివరాలను డిజిటలైజ్ చేస్తూ జాబితా ప్రక్షాళన చేపడుతున్నారు. దీంతో బోగస్ ఓట్లు, మరణించిన వారి పేర్లపై కొనసాగుతున్న ఓట్లు, ఒకే వ్యక్తికి రెండు లేదా అంతకంటే ఎక్కువ చోట్ల నమోదైన ఓట్లు పూర్తిస్థాయిలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మృతులు, డబుల్ ఓట్ల తొలగింపుపై పెద్దగా అభ్యంతరాలు లేకపోయినా, నిజమైన అర్హుల ఓట్లు తొలగిపోతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతీ ఓటరు తమ ఓటు హక్కును కొనసాగించుకోవాలంటే ఎన్యూమరేషన్ ఫారం సమర్పించడం అత్యంత కీలకంగా మారింది. ఓటరు జాబితాలో నమోదైన చిరునామా ఆధారంగానే బీఎల్‌వోలు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తున్నారు. అయితే ఇళ్లు మారిన వారు, వలస కార్మికులు, ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన ఉద్యోగులు పాత చిరునామాలో అందుబాటులో లేకపోతే వారిని శ్రీషిఫ్టెడ్ఙ్‌గా నమోదు చేస్తున్నారు. అలాంటి వారు ఫారం సమర్పించకపోతే ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు లేకపోయే అవకాశం ఉంది. అనంతరం కొత్తగా ఓటరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఓటర్లు: 7,12,157
డిజిటలైజేషన్: 6,08,470
మృతులు: 13,074
వేరే చోటుకు తరలించడం: 28,166
రెండు చోట్ల ఓట్లు: 14,138
అందుబాటులో లేనివారు: 396
నియోజకవర్గం మొత్తం ఓట్లు డిజిటలైజేషన్ శాతం అయిన ఓట్లు
రామగుండం 2,13,990 1,70,990 79.91
మంథని 2,38,765 2,10,776 88.28
పెద్దపల్లి 2,59,402 2,26,704 87.39
ఉపాధి కోసం హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారిలో చాలామంది తమ సొంత గ్రామంలోనే ఓటు కొనసాగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. సొంతూరిలో ఓటు ఉండడం సామాజికంగా, రాజకీయంగా ప్రాధాన్యమనే భావనతో అక్కడినే ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పిస్తున్నారు. గతనెల 25న ప్రారంభమైన సర్ ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు ఆగస్టు 3 వరకు అవకాశం ఉంది. అనంతరం ఆగస్టు 10న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. అదే రోజు నుంచి సెప్టెంబర్ 9 వరకు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నారు. అన్ని అభ్యంతరాల పరిశీలన అనంతరం అక్టోబర్ 12న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.


