పెద్దపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు ప్రక్రియలో పెద్దపల్లి జిల్లా విశేష పురోగతి సాధించింది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన యూడైస్‌ప్లస్ నమోదులో రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచింది. ఈఏడాది 34,254 మంది విద్యార్థులను నమోదు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటివరకు 32,234 మందితో 93.52శాతం నమోదు పూర్తయింది. గతేడాది జూన్ 15 నాటికి నమోదైన విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే ఈసారి 7,791 మంది అదనంగా నమోదు కావడంతో 31.14 శాతం వృద్ధి చెందింది. జిల్లాలో మొత్తం 530 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వాటిలో 199 పాఠశాలలు (37.55శాతం) లక్ష్యానికి కంటే ఎక్కువ నమోదు సాధించాయి. 141 పాఠశాలలు (26.60శాతం) లక్ష్యానికి కంటే తక్కువ నమోదు చేశాయి.
ప్రభుత్వ బడిపై పెరుగుతున్న నమ్మకం
ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో విశ్వాసం పెరుగుతోంది. సుల్తానాబాద్ మండల పరిషత్ బాలికల ప్రాథమిక పాఠశాలలో ఈవిద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతేడాది కేవలం 23 మంది మాత్రమే ఉన్న విద్యార్థుల సంఖ్య, ప్రస్తుతం 67 మందికి చేరింది. ఒకే ఏడాదిలో 44 మంది కొత్త విద్యార్థులు చేరారు. దీనికి ప్రభుత్వం చేపట్టిన విద్యాసంస్కరణలు, ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ తరగతులు, మౌలిక వసతుల మెరుగుదలే కారణంగా భావిస్తున్నారు.
నలుగురు విద్యార్థులతోనే..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ సుల్తానాబాద్‌లోని సుగ్లాంపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మాత్రం కేవలం నలుగురు విద్యార్థులతోనే కొనసాగుతోంది. ఒక ఉపాధ్యాయుడు ఈ నలుగురు చిన్నారులకు బోధన అందిస్తున్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది.


