జ్యోతినగర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద పౌరుల కోసం అమలు చేస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాల పంపిణీ విధానంలో ఒక విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రతీ పౌరుడికి ఒకే ఒక మల్టీపర్పస్ యూనిఫైడ్ కార్డును జారీ చేసేందుకు ఐటీ శాఖ వేగంగా కసరత్తు చేస్తోంది.
అన్ని శాఖల సంక్షేమం ఒకేచోట..
ప్రస్తుతం లబ్ధిదారులకు వేర్వేరు పథకాల కోసం విడివిడిగా కార్డులున్నాయి. కానీ ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త ఏఐ ప్రొఫైలింగ్ సిస్టమ్ ద్వారా ఆరోగ్యశ్రీ, చేయూత పెన్షన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ముఖ్యమంత్రి సహాయ నిధి, కార్మిక శాఖ పరిధిలోని అన్ని ప్రయోజనాలు ఒకే డిజిటల్ కార్డు కిందకు రానున్నాయి. దీనికోసం ఇటీవల సేకరించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, కుల సర్వే డేటాను కూడా ఈ కార్డుతో అనుసంధానించనున్నారు.
ఒకే కార్డు.. బహుళ ప్రయోజనాలు
ఒకే డిజిటల్ కార్డు ద్వారా రేషన్, పెన్షన్, ఫ్రీ హెల్త్ కేర్ వంటి అన్ని రకాల సంక్షేమ ప్రయోజనాలను అర్హులు పొందొచ్చు.
పారదర్శకత..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడడం వల్ల ఒకే లబ్ధిదారుడు ఒకేరకమైన లబ్ధిని రెండుసార్లు పొందకుండా అరికట్టడం సులువవుతుంది.
గల్ఫ్ వలసదారులకు ప్రత్యేక ప్రొఫైల్
కేరళ రాష్ట్ర ఉత్తమ విధానాల తరహాలోనే తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే కార్మికుల నైపుణ్యాలు, పాస్‌పోర్ట్, వీసా వివరాలను కూడా ఈ కేంద్రీకృత వ్యవస్థలో చేర్చనున్నారు.
రాష్ట్రస్థాయి ప్రత్యేక గుర్తింపు సంఖ్య
ఈ ప్రాజెక్టును మరింత పటిష్టం చేయడానికి జాతీయస్థాయి గుర్తింపు కార్డుల తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. ఒక వ్యక్తి మరణించినప్పుడు జారీ అయ్యే డెత్ సర్టిఫికెట్ డేటా ఆటోమేటిక్‌గా చేయూత పెన్షన్ డేటాబేస్‌కు లింక్ అయ్యేలా ఏఐ రూటింగ్ సిస్టమ్‌ను డిజైన్ చేస్తున్నారు. ప్రభుత్వ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ప్రొఫైలింగ్‌ను కూడా ఇందులో చేర్చడం ద్వారా అర్హులైన నిజమైన పేదలకు మరింత వేగంగా అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది.


