కరీంనగర్‌స్పోర్ట్స్: శారీరక విద్యాకోర్సుల్లో ప్రవేశాలకు కరీంనగర్‌లో నిర్వహించిన టీజీపీఈసెట్ –2026 బుధవారంతో ప్రశాంతంగా ముగిసింది. భానుడి భగభగలను లెక్కచేయకుండా అభ్యర్థులు శారీరక, నైపుణ్య పరీక్షల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఏడాది బీపీఈడీ, డీపీఈడీ కోర్సులకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,436 మంది హాజరయ్యారు. ఇందులో బీపీఈడీ కోర్సుకు 1,788 మంది, డీపీఈడీ కోర్సుకు 648 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వ్యాయామ విద్యా రంగంలో స్థిరపడాలనే పట్టుదలతో క్రీడాకారులు శారీరకదారుఢ్య పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. పరీక్షల ఫలితాలను ఈనెల 6న విడుదల చేయనున్నట్లు టీజీపీఈసెట్ 2026 చైర్మన్, శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేశ్ కుమార్, కన్వీనర్ రాజేష్ కుమార్ తెలిపారు.
ఇంధన డిపో సందర్శన
రామగుండం: కుందనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్) ఇంధన డిపోను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. అగ్ని ప్రమాదాల నివారణ, భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. డిపో మేనేజర్ మనీశ్ తదితరులు ఉన్నారు.
నియామకం
పెద్దపల్లి: జిల్లా కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు ఆకుల స్వామి వివేక్ పటేల్‌ను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సోషల్ మీడియా జిల్లా ఇన్‌చార్జిగా నియమించారు. ఈమేరకు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఒరగంటి ఆనంద్ బుధవారం ఆయనకు నియామకపత్రం అందజేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆకుల స్వామి వివేక్ పటేల్ విశిష్ట పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఆయనను పలువురు అభినందించారు.


