ఈనెల 15 నుంచి సింగరేణిలో కవిత ‘బాయిబాట’ ఇప్పటికే కార్యాచరణ ప్రకటించిన టీబీజీకేఎస్ ఆందోళన బాటలో కార్మిక సంఘాలు
గోదావరిఖని: తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత కోల్‌బెల్ట్ పర్యటన ఖరారైంది. ‘బాయిబాట’ పేరిట సింగరేణి అండర్ గ్రౌండ్, ఓపెన్‌కాస్ట్ గనుల్లో కార్మికులతో ఆమె సమావేశమవుతారు. కల్వకుంట్ల కవిత పర్యటన సింగరేణిలో పొలిటికల్ హీటెక్కిస్తోంది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విస్తరించిన సింగరేణి బొగ్గు గనుల్లో పర్మినెంట్ కార్మికులు సుమారు 40వేల మంది, కాంట్రాక్టు కార్మికులు దాదాపు 30వేల మందికిపైగా ఉన్నారు. పరోక్షంగా మరో 20 వేల కుటుంబాలు సింగరేణి సంస్థపై ఆధారపడి జీవిస్తున్నాయి.
కార్మికుల ఓట్లే కీలకం..
ప్రతీ అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి కార్మికుల ఓట్లు కీలకంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటర్లు పట్టంకట్టారు. గతంలో బీఆర్‌ఎస్‌ను ఆదరించారు. ఈక్రమంలో సింగరేణి ఉద్యోగుల ఓ ట్లు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారాయి. ప్ర స్తుతం సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల కాలపరిమితి ముగియడం, మెడికల్ ఇన్వాలిడేషన్ నిలిచిపోవడం, మెడికల్ పూర్తయిన అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వకపోవడం, విజిలెన్స్ విచారణ పేరిట మారుపేరు ఉద్యోగుల డిపెండెంట్ల ఉద్యోగాలు ని లిపివేయడంతో పాటు అనేక సమస్యలు ఉన్నాయి. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘంతోపాటు జాతీయ కార్మిక సంఘాలు సింగరేణి తీరుపై ఆందోళన చేపట్టాయి. అన్నిగనులపై టీబీజీకేఎస్ నల్లబ్యాడ్జీలతో నిరసన నిర్వహించింది. సీఐటీయూ నాయకులు జీఎం కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేసింది.
టీబీజీకేఎస్ కార్యాచరణ
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ ఆందోళనకు సిద్ధమైంది. యూనియన్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ రెండ్రోజు క్రితం సమావేశమై యూనియన్ శ్రేణులను అప్రమత్తంచేశారు. ఇందులో భాగంగా బుధవారం నల్లబ్యాడ్జీలతో గనులపై నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఆందోళన బాటలో కార్మిక సంఘాలు
ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ యాజమాన్యం హా మీతో కొంత మెత్తబడినా మిగతా కార్మిక సంఘాలు ఉధ్యమానికి సిద్ధమయ్యాయి. సీఐటీయూ, హెచ్‌ఎంఎస్, బీఎంఎస్ తమ పోరాటానికి పదును పెడుతున్నాయి. ఈక్రమంలో ప్రతినెల రెండు మెడికల్ ఇన్వాలిడేషన్ నిర్వహించి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలివ్వాలనే డిమాండ్ పెరుగుతోంది.
డిప్యూటీ సీఎం హామీ ఇచ్చినా..
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కోల్‌బెల్ట్‌ప్రాంత ఎమ్మెల్యేలతో సమావేశమై కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయినా.. కార్యాచరణలో ముందుకు సాగకపోవడంతో కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మారుపేర్ల మార్పు, మెడికల్ ఇన్వాలిడేషన్ కార్మికుల పిల్లలు ప్రభుత్వం తీరుపై ఆగ్రహంతో ఉన్నారు.


