ధర్మారం: ‘వ్యవసాయ మార్కెట్‌కు రైతులు తీసుకొవచ్చిన మక్కలను ఎందుకు ఖాళీ చేయడంలేదు.. రోజుల తరబడి మక్కల వద్దే పడిగాపులు పడుతుంటే వారి గోస పట్టదా.. ఈరోజు మక్కలు మొత్తం ఖాళీ చేయాలి.. అందుకు సరిపడా లారీలు సమకూర్చాలి.. హమాలీల కొరత ఉంటే కూలీలు, హమాలీలను నియమిస్తాం.. రైతులపై భారం పడకుండా ప్రభుత్వం నుంచే డబ్బులు ఇప్పిస్తా’ అని సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. తాను కాళేశ్వరం వెళ్లివచ్చేలోగా సగం మక్కలు తరలించాలని సూచించారు. ఆదివారం రాత్రి ధర్మారంలో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పాన్‌టేలాలు, ధ్వంసమైన ఇళ్ల మంత్రి సోమవారం సందర్శించారు. స్థానిక మార్కెట్‌లో మక్కల కుప్ప లు ఆయన పరిశీలించారు. కాంటా పూర్తయినా లారీలు రావడం లేదని పలువురు రైతులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన మంత్రి.. సంబంధిత అధికారికి వెంటనే ఫోన్ చేశారు. సరిపడా లారీలు సమకూర్చాలని సూచించారు.
డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజీనామా
ఇసుక దందాలో తాను డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీమానా చేస్తానని మంత్రి లక్ష్మణ్‌కుమార్ సవాల్ చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలోనే ఇసుక దందా సాగిందని, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నేరేళ్ల మానేరు నుంచి నిత్యం వందలాది లారీలతో కేటీఆర్, సంతోష్‌రావు అక్రమంగా ఇసుక తరలిస్తున్న క్రమంలో దళితులపై జరిగిన ఘోరాల గురించి మంత్రిగా కొనసాగిన ఈశ్వర్ ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సోగాల తిరుపతి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పాలకుర్తి రాజేశంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


