రామగుండం: విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా సౌత్ కోస్ట్ రైల్వేజోన్(ఎస్సీవోఆర్) జూన్ ఒకటో తేదీన ఆవిర్భవించనుంది. దక్షిణ మధ్య రైల్వేజోన్‌లోని ఆరింటిలో మూడు డివిజన్లు ఎస్సీవోఆర్‌లో విలీనం కానున్నాయి. మిగిలేవి సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు మాత్రమే. డివిజన్ల సరిహద్దులు మారడంతో పెద్దపల్లి జంక్షన్ హైదరాబాద్ డివిజన్‌లో విలీనం కానుంది. రైల్వేట్రాక్ నెట్‌వర్క్ విస్తరణ 204 కి.మీ.కు పెరగనుంది. తద్వారా సికింద్రాబాద్ డివిజన్‌లో 40శాతం ఆదాయం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఆర్థికపరమైన లాభాలు
కొత్త జోన్ ఏర్పాటుతో సికింద్రాబాద్ డివిజన్‌లోకి రాయచూర్–వాడీ, పగిడిపల్లి–జాన్‌పహాడ్ సెక్షన్లు విలీనమవుతాయి. దీనిద్వారా అదనంగా 204 కి.మీ. రైల్వే ట్రాక్ పెరగనుంది. బొగ్గు, సిమెంట్ తదితర పారిశ్రామిక సరుకు రవాణా పెరుగుతుంది. ఈ డివిజన్‌లో రామగుండం, మంచిర్యాల ద్వారా సింగరేణి బొగ్గు ఎగుమతితో ఆదాయం సమకూరుతుంది.
పెరగనున్న జోన్‌స్థాయిలో ప్రాధాన్యత
దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్ డివిజన్ అతిపెద్దదిగా.. 1,800 కిలోమీటర్ల నెట్‌వర్క్ ఉంటుంది. ఫండింగ్, ప్రాజెక్టులు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. హైదరాబాద్ మెట్రోపాలిటిన్ ఏరియా, ఉత్తర తెలంగాణలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వీటితోపాటు తెలంగాణ ఇండస్ట్రియల్ ఫార్మా, ఐటీ, లాజిస్టిక్స్ ఎగుమతులతో ఫ్రైట్, ప్యాసింజర్ ఆదాయం పెరుగుతుంది.
ఆర్థికపరమైన నష్టాలు
దక్షిణ మధ్య రైల్వే మొత్తం ఆదాయం గతేడాది గరిష్టంగా రూ.23వేల కోట్లు ఉండగా, కొత్త జోన్ ఏర్పాటుతో 40శాతం కోత పడనుందని అధికారులు చెబుతున్నారు. ఫ్రైట్ ఆదాయం రూ.13వేల కోట్ల నుంచి రూ.7వేల కోట్లకు పడిపోయే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
పెద్దపల్లి–నిజామాబాద్ లైన్ మరో డివిజన్‌లోకి..
పెద్దపల్లి జంక్షన్ నుంచి నిజామాబాద్ వరకు 177 కి.మీ. ట్రాక్ హైదరాబాద్ డివిజన్‌లోకి మారుతుంది. తద్వారా ఫ్రైట్, ప్యాసింజర్ ఆదాయం తగ్గుతుంది. వీటితో పాటు కొండపల్లి–మోటమర్రి సెక్షన్ కొత్త జోన్‌లోకి వెళ్తాయి. తద్వారా ఫ్రైట్ ఆదాయానికి గండిపడుతుంది. రెండు సెక్షన్లు సికింద్రాబాద్ డివిజన్‌లో చేర్చడం ద్వారా 204 కి.మీ. నెట్‌వర్క్ పెరిగినా.. సిగ్నలింగ్, సిబ్బంది, ఇంధనం, ట్రాక్ నిర్వహణ వ్యయం భారం కానుంది.
కాజీపేట–బల్హర్షా మధ్య..
కాజీపేట, హసన్‌పర్తి, ఉప్పల్, రామగుండం, పెద్దంపేట, మంచిర్యాల, రవీంద్రఖని, బెల్లంపల్లి, రేచ్నిరోడ్, సిర్పూర్ కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ రైల్వేస్టేషన్లు సికింద్రాబాద్ డివిజన్‌లోనే ఉంటాయి. జమ్మికుంట, పెద్దపల్లి జంక్షన్, రాఘవపురం మాత్రమే హైదరాబాద్ డివిజన్‌లోకి వెళ్తాయి.
దక్షిణ మధ్య రైల్వేలో డివిజన్ల పునర్‌వ్యస్థీకరణ ఫలితం
జూన్ ఒకటో తేదీనుంచి అమలులోకి పరిపాలనా వ్యవస్థ


