‘అకాల’ భయం | - | Sakshi
Sakshi News home page

‘అకాల’ భయం

Apr 27 2026 8:18 AM | Updated on Apr 27 2026 8:18 AM

● ఆకాశంలో మబ్బులతో రైతన్నల్లో గుబులు ● ఏప్రిల్‌, మే మాసాలు అన్నదాతలను ముంచే కాలం ● కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం రాశులు ● గత అనుభవాలపై ఆందోళన ● నష్టం జరుగక ముందే తేరుకుంటే మంచిది

ఖరీప్‌ సీజన్‌లో వర్షం నష్టం చేసిన తేదీలు

మంథని: పంట చేతకచ్చే ప్రతీ ఖరీఫ్‌, రబీ సీజన్‌లలో అకాల వర్షం రైతన్నను నిలువునా మంచుతోంది. ఈసారి కూడా అవే పరిస్థితులు కనిపిస్తుండడంతో రైతులు హైరానా పడుతున్నారు. గత ఐదు సంవత్సరాల్లో పరిశీలిస్తే ఏప్రిల్‌, మే నెలల్లోనే ఖరీఫ్‌ సీజన్‌ రైతులను ముంచిన సందర్భాలున్నాయి. మంథని డివిజన్‌లో 50వేల ఎకరాలకు పైగా వరిసాగు చేశారు. వరి కోతకు రావడంతో రైతులు తమ పంటను కోసి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించారు. అయితే సకాలంలో ధాన్యం తూకం కాకపోవడంతో కేంద్రాల్లోనే నిల్వ ఉన్నాయి. మాయిశ్చర్‌, ఇతర కారణాల వల్ల అనేక మంది రైతుల ధాన్యం తూకం వేయలేదు. నాలుగు రోజుల నుంచి మబ్బులు కమ్ముకొచ్చి వర్షసూచన ఉన్నా అధికారులు నిర్లక్ష్యంగానే వహిస్తున్నారు. కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యం నిల్వలను వెనువెంటనే తూకం వేయడంలో ఆశ్రద్ధ కనబర్చుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం పడటంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. మళ్లీ వర్షం ఎక్కడ ముంచుతుందో అని గుండెలు బాదుకుంటున్నారు. ఽ ఆదివారం ఒక్కసారిగా వాతావరణంలో మార్పుచోటు చేసుకొని మబ్బులు కమ్ముతున్నాయి. ఈక్రమంలో వర్షం ఎప్పుడు వస్తుందోనని రైతులు భయపడుతున్నారు.

వర్షం పడితే నష్టంపోయేది మంథని రైతులే ఎక్కువ

మంథని వ్యవసాయ మార్కెట్‌లో సిమెంట్‌ ప్లాట్‌ఫాం, డ్రైనేజీ సిస్టం బాగా లేదు. దీంతో ప్రతీసారి వర్షానికి ధాన్యం పెద్ద ఎత్తున కొట్టుకుపోయి రైతులు నష్టపోతున్నారు. 200 క్వింటాళ్లకు పైగా ధాన్యం రాశులు ప్రతీసారి కేంద్రంలో నిల్వ ఉంటున్నాయి. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొంది. కాలువలకు సమీపంలో ధాన్యం రాశులు వేయకుండా మార్కెట్‌ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నా రైతులు ధాన్యం వేసేందుకు స్థలం లేకపోవడంతో అక్కడే వేశారు. దీంతో వర్షానికి పెద్ద ఎత్తున ధాన్యం కాలువలో పడి కొట్టుకుపోయే ప్రమాదం ఉంది.

నష్టం జరగక ముందే అప్రమత్తత అవసరం

వర్షసూచన ఉండడంతో నష్టం జరుగక ముందే వెనువెంటనే ధాన్యం తూకం వేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఐదు కాంటాలతో తూకం వేస్తున్నారు. అవసరమైతే మరో ఐదు కాంటాలను ఏర్పాటు చేసి ఎక్కువ మంది హమాలీలతో రాత్రింబవళ్లు కాంటాలు వేసి ధాన్యం సేకరిస్తే బాగుంటుందని రైతులు అభిప్రాయపడ్డారు. అంతేగాకుండా సరిపడా టార్పాలిన్‌ కవర్లు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. నష్టం జరిగిన తర్వాత అధికారులు, ప్రజాప్రతినిధులు, పలకరింపులు ఎందుకని, అంతకుముందే తేరుకుంటే అందరికీ మంచిదనే అభిప్రాయం అన్నదాతల్లో వ్యక్తమవుతోంది. ఒక్క మంథని డివిజన్‌లోనే కాకుండా జిల్లాలోని పీఏసీఎస్‌, ఐకేపీ, డిసీఎంఎస్‌ కొనుగోలు కేంద్రాల్లో వందలాది క్వింటాళ్ల ధాన్యం రాశులు పేరుకుపోయాయి.

2025 ఏప్రిల్‌ 30

2024 మే 17

2023 ఏప్రిల్‌ 25

2021 మే 4

2023 ఏప్రిల్‌ 20

Advertisement
 
Advertisement
Advertisement