మంథనిరూరల్: వర్షాకాలం, యాసంగి సీజన్‌లలో పంటల సాగుకు ముందు ఏ భూమిలో ఏ పంట వేయాలో తెలుసుకునేందుకు భూసార పరీక్షలు చేస్తుంటారు. పంటల్లో నాణ్యమైన అధిక దిగుబడితో పాటు సస్యరక్షణ చర్యలపై ప్రత్యేక దృష్టిసారించే క్రమంలో భూసార పరీక్షలు కీలకమైనవి. అయితే చాలా మంది రైతులకు భూసార పరీక్షలపై అవగాహన లేకపోవడం, వ్యవసాయ అధికారులపై పనిభారం పడుతుండటంతో ఈ పరీక్షలు నామమాత్రంగానే జరిగేవి. ఈనేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా భూసార పరీక్షలు నిర్వహించేలా వలంటీర్ల నియామకానికి కసరత్తు చేస్తోంది. ప్రతీ గ్రామంలో ముగ్గురిని నియమించి ఏటా భూసార పరీక్షలు చేసి ఫలితాలను రైతులకు అందించేలా ఏర్పాట్లు చేస్తోంది.
రెవెన్యూ విలేజ్‌కు ముగ్గురు చొప్పున
ప్రతీ రెవెన్యూ విలేజ్‌కు ముగ్గురు వలంటీర్ల నియామకానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పెద్దపల్లి జిల్లాలో 206 రెవెన్యూ విలేజ్‌లు ఉన్నాయి. ఇప్పటికే క్లస్టర్ల వారీగా వలంటీర్ల నియామకంపై వ్యవసాయ శాఖ అధికారులు దృష్టి సారించారు. ఆయా గ్రామాల నుంచి రైతులనే వలంటీర్లుగా ఎంపిక చేసేందుకు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.
ముందుకు రాని వలంటీర్లు
భూసార పరీక్షలు రైతులకు చేరువ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం వలంటీర్ల నియామకం చేపట్టగా ఆ దిశగా అడుగులు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం నియామకం చేసే వలంటీర్లకు ఎలాంటి పారితోషికం చెల్లించక పోవడంతో ఉచిత సేవలపై ఆసక్తి చూపడం లేదు. జిల్లా వ్యాప్తంగా 206 రెవెన్యూ విలేజ్‌లు ఉండగా ప్రతీ రెవెన్యూ విలేజ్‌కు ముగ్గురు చొప్పన నియమించాలి. కానీ ఇప్పటి వరకు కనీసం 50శాతం కూడా నియామకం జరుగలేదని తెలుస్తోంది.
భూసార పరీక్షలతో రైతులకు మేలు
భూసార పరీక్షలతో రైతులకు అనేక ప్రయోజనాలు ఉంటాయి. భూసార పరీక్షలు చేయడం ద్వారా ఆ భూమిలో ఏఏ లవణాలు, పోషకాలు తక్కువగా ఉన్నాయో గుర్తించవచ్చు. భూసార పరీక్షలతో ఏ పంట సాగు చేయాలో, ఆ పంటకు ఎంత మోతాదులో ఎరువులు అందించాలో తెలుస్తుంది. భూసార పరీక్షలు చేయించుకోకపోవడంతో పలు రసాయన ఎరువులు వాడటంతో భూసారం దెబ్బతిని పంట దిగుబడిపై ప్రభావం చూపుతోంది.
గతంలో వ్యవసాయ అధికారులే..
గతంలో భూసార పరీక్షల బాధ్యతలు వ్యవసాయ శాఖ అధికారులే నిర్వహించే వారు. గత ప్రభుత్వ హయాంలో భూసార పరీక్షల కోసం ప్రత్యేక కిట్‌లు అందజేయగా రైతు వేదికల్లో రైతు భూమిలోని మట్టిని సేకరించి అక్కడే పరీక్షలు నిర్వహించి ఫలి తాలు చెప్పేవారు. కానీ ఈసారి నూతనంగా వలంటీర్లను నియమించి వారి ద్వారా వ్యవసాయ భూ ముల్లో మట్టిని సేకరించి ల్యాబ్‌కు పంపి ఫలితాలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
వలంటీర్ల నియామకం మొదలు పెట్టాం
జిల్లావ్యాప్తంగా భూసార పరీక్షల కోసం వలంటీర్ల నియామకం ప్రారంభించారు. 206 రెవెన్యూ విలేజ్‌లలో అక్కడి వ్యవసాయ అధికారులతో నియామకాలకు శ్రీకారం చుట్టాం. అయితే ఉచితంగా రైతులకు సేవలు అందించాలని ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఈవిషయంలో ప్రతీ గ్రామంలో అవగాహన కల్పిస్తున్నాం. వలంటీర్లను పూర్తి స్థాయిలో నియమించేలా చర్యలు తీసుకుంటాం.
– శ్రీనివాస్,జిల్లా వ్యవసాయ శాఖ అధికారి


