రాఘవాపూర్‌లో 10 ఎకరాల స్థలం కేటాయింపు పెద్దపల్లిలోనే నిర్మించాలంటూ న్యాయవాదుల రిలే దీక్షలు
పెద్దపల్లిరూరల్: జిల్లా ప్రధాన న్యాయస్థానం, సీనియర్, జూనియర్ జడ్జి ఇలా.. ఇంకా పలు కోర్టులన్నీ ఒకే సముదాయంలో నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌లో 10 ఎకరాల స్థలం కేటాయించి, భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేసి టెండర్లను కూడా ఖరారు చేసింది. ఇప్పటిదాకా బాగానే ఉన్నా... న్యాయవాదుల నడుమ బేధాభిప్రాయాలు పొడచూపాయి. జిల్లా కేంద్రమైన పెద్దపల్లి పట్టణంలోనే కోర్టు భవనాలు నిర్మించాలంటూ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మేకల మల్లేశంతో పాటు పలువురు సీనియర్ న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కోర్టు భవన నిర్మాణాలు ఇంకా ప్రారంభానికి నోచుకోవడం లేదు.
20వ రోజుకు చేరిన రిలేదీక్షలు
జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలోనే కోర్టు భవనాలు నిర్మిస్తే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని న్యాయవాదులు పేర్కొంటున్నారు. పెద్దపల్లి పట్టణమే అందరికీ అనువుగా ఉంటుందని, ఇందుకోసం అవసరమైన స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలేదీక్షలు సోమవారం నాటికి 20వ రోజుకు చేరాయి.
రాఘవాపూర్‌లో వద్దేవద్దు
జిల్లా కోర్టు సముదాయ భవనాలను పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌లో నిర్మించేందుకు అంగీకరించబోమంటూ న్యాయవాదులు స్పష్టం చేస్తున్నారు. పెద్దపల్లిలో నిర్మించడం వల్ల అందరికీ అనువుగా ఉంటుందని అంటున్నారు. బస్‌డిపోకు కేటాయించిన స్థలం, కలెక్టరేట్ ఆవరణలోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ప్రాంతం, నిరుపయోగంగ ఉన్న పురావస్తుశాఖ భూమిలోనో ఇలా రాజీవ్ రహదారి వెంట ఉండేలా స్థలం కేటాయిస్తే తమకు అభ్యంతరం లేదని న్యాయవాదులు పేర్కొంటున్నారు.
విశాలమైన స్థలం అక్కడే..
పెద్దపల్లి నుంచి మంథనికి వెళ్లే ప్రధాన రోడ్డుకు అతి సమీపంలోనే ఉన్న రాఘవపూర్‌లో జిల్లా కోర్టు సముదాయానికి స్థలం కేటాయించారని కొందరు న్యాయవాదులు పేర్కొంటున్నారు. పదెకరాల విశాలమైన స్థలం మరెక్కడా లేదని, స్థల కేటాయింపు సమయంలో ఏకాభిప్రాయమే ఉన్నా.. ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయడంలో అర్థం లేదని అంటున్నారు. ఎమ్మెల్యే విజయరమణారావు సైతం కోర్టు భవన నిర్మాణ విషయంలో వివాదాలు సృష్టించొద్దని, రాఘవాపూర్‌లోనే పనులు మొదలయ్యేలా అందరూ సహకరించాలంటున్నారు.


