కమ్ముకున్న మేఘం.. రైతుల్లో భయం | - | Sakshi
Sakshi News home page

కమ్ముకున్న మేఘం.. రైతుల్లో భయం

Apr 26 2026 5:03 AM | Updated on Apr 26 2026 5:03 AM

కోతకు వచ్చింది

వీణవంక: రెండ్రోజులుగా ఆకాశం మేఘావృతమై మబ్బులు కమ్ముకున్నాయి. ఎప్పుడు ఆకాల వర్షాలు పడతాయోనని విత్తనోత్పత్తి రైతులు కలవరపడుతున్నారు. వారం రోజుల్లో ఆడ, మగ వరి కోతలు ప్రారంభం కానుండగా వాతావరణం చల్లబడుతుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఉత్తర తెలంగాణలోనే హైబ్రిడ్‌ సాగులో కరీంనగర్‌ జిల్లా మొదటి స్థానంలో ఉంది. మరో వారం రోజుల్లో పంట కోతలు ప్రారంభిచనున్నారు. కరీంనగర్‌ జిల్లాలో వీణవంక, జమ్మికుంట, శంకపట్నం, పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌, ఓదెల, ముత్తారం, జగిత్యాల జిల్లాలో పెగడపల్లి, ధర్మారం మండలాల్లో హైబ్రిడ్‌ సీడ్‌ను సాగు చేస్తున్నారు. ఈ సారి 1.20లక్షల ఎకరాల్లో వరిసాగులోకి వచ్చినట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పుతున్నారు. ఆడ వరి కన్నా వారం ముందు మగ వరి కోయాల్సి ఉంటుంది. మగ వరి కోతలు ప్రారంభం కాగా.. ఆడవరి కోతలు ఇంకా ప్రారంభం కాలేదు. ప్రస్తుతం ఆడపైరులో బెరుకు తీసే పనిలో రైతులు బిజీగా ఉన్నారు.

చిరుజల్లులకే నేలరాలే స్వభావం

మగ వడ్లను కంపెనీలు కొనుగోలు చేయవు. ఆడ వడ్లను మాత్రమే దిగుమతి చేసుకుంటాయి. క్వింటాల్‌కు రూ.7వేల నుంచి రూ.20వేల వరకు కంపెనీలు చెల్లిస్తున్నాయి. మగ వడ్లను రైతులు ప్రైవేట్‌గా విక్రయించాల్సిందే. ఆడవడ్లకు ఈదురుగాలులు, చిరుజల్లులకే నేలరాలే స్వభావం ఉంటుంది. కంపెనీ ప్రతినిధులు వచ్చి సర్టిఫై చేస్తేనే వరి కోయాల్సి ఉంటుంది. లేకుంటే ధాన్యం రిజెక్ట్‌ చేసే అవకాశం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 28నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించడంతో రైతులు దిక్కుతోచన స్థితిలో పడ్డారు.

పెట్టుబడి ఎక్కువే

సాధారణ వరి సాగు చేస్తే ఎకరాకు రూ.20వేల నుంచి రూ.25వేల పెట్టుబడి అవుతుంది. ఆడ, మగ సాగు చేస్తే రూ.40వేల నుంచి రూ.50వేల పెట్టుబడి అవుతుంది. ఎకరం నాటు(హైబ్రిడ్‌)కు 20మంది కూలీలు అవసరం. సాధారణ వరికి 12మందితో పూర్తి చేస్తారు. వాతావరణం అనుకూలిస్తే హైబ్రిడ్‌ వరికి రూ.లక్ష నుంచి రూ.1.50లక్షల మధ్య దిగుబడి వస్తుంది. జిల్లాలోనే వీణవంక మండలం బేతిగల్‌, మల్లారెడ్డిపల్లి గ్రామాలు దిగుబడిలో మొదటిస్థానంలో ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలోని ముత్తారం మండలం ఓడేడు గ్రామం సాగులో ఆదర్శంగా నిలస్తుంది. వరుణుడు 15రోజులు గడువు ఇస్తే రైతులు గట్టెక్కనున్నారు. లేకుంటే తీవ్ర నష్టపోయే ప్రమాదముంది.

కోతదశలో హైబ్రిడ్‌(ఆడ, మగ) వరి

ఈ సమయంలో వర్షాలు కురిస్తే పైరుకు తీవ్ర నష్టం

చిరుజల్లులకే గింజలు నేలరాలే స్వభావం

ఆందోళనలో సీడ్‌ వరి రైతులు

జిల్లాలో 1.20లక్షల ఎకరాలలో సాగు

మూడేళ్లుగా వరి సాగు వివరాలు(ఎకరాల్లో

2024 68,000

2025లో 85,000

2026లో 1.20,000

ఐదు ఎకరాలలో ఆడ, మగ వరి పంట వేసిన. మగ వరి కోసి రెండు రోజులవుతుంది. ఆడ వరి కోయడానికి కంపెనీ ప్రతినిధులు ఇంకా అనుమతి ఇవ్వలేదు. రెండు రోజులుగా మబ్బులు కమ్ముకుంటుంటే ప్రాణం వణుకుతోంది. పంట చేతికి వచ్చిన సమయంలో ఆకాల వర్షాలు పడితే కోలుకోలేం. ఇప్పటికే ఎకరాకు రూ.40వేల పెట్టుబడి పెట్టిన. పది రోజులు వరుణుడు కరుణిస్తే గండం నుంచి గట్టెక్కుతా. – శ్రీనివాస్‌, రైతు, బేతిగల్‌

Advertisement
 
Advertisement
Advertisement