పెద్దపల్లిరూరల్: ప్రజాప్రభుత్వంలోనే రైతులకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. తుర్కలమద్దికుంట, నిట్టూరు, నిమ్మనపల్లి, పెద్దకల్వల, పెద్దబొంకూర్, కొత్తపల్లి, మూలసాల, భోజన్నపేట, మారెడుగొండ, గుర్రాంపల్లిలో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. పెద్దకల్వలలో విలేకరులతో మాట్లాడారు. రైతులు ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించార. గింజ కోత లేకుండా కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.
బీఆర్‌ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు
సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తూ లబ్ధి పొందేందుకు బీఆర్‌ఎస్, బీజేపీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని విజయరమణారావు విమర్శించారు. కాళేళ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయాయని బీఆర్‌ఎస్ నేతలు అంగీకరిస్తూనే తప్పును కప్పిపుచ్చుకునేందుకు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. మాజీమంత్రి కేటీఆర్ సోయిలేకుండా పూటకోమాట మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని సీఎం కోరినా బీజేపీ మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కేంద్రాన్ని ఒప్పించకపోవడమేంటని ప్రశ్నించారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, నాయకులు బండారి రామ్మూర్తి, నర్సింహారెడ్డి, మార్కెట్‌చైర్మన్ కూర మల్లారెడ్డితోపాటు ఆయా గ్రామాల సర్పంచులు రాజయ్య, ఆకుల సువర్ణ, వేల్పుల రమేశ్, నర్ల కనకమ్మ, తిరుపతి, రిబిక, శ్వేత, త్రివేణి, గుర్రం దేవేంద్ర, సంపత్, పెగడ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు


