కంటి వైద్యంలో మసక! | - | Sakshi
Sakshi News home page

కంటి వైద్యంలో మసక!

Apr 24 2026 6:32 AM | Updated on Apr 24 2026 6:32 AM

రిజిస్ట్రేషన్‌ లేని ఆసుపత్రులు తనిఖీల్లో బయటపడిన నిజాలు ఆప్టికల్‌ షాపుల్లో అక్రమ పరీక్షలు నోటీసులతో సరిపెడుతున్న వైద్యాధికారులు

ఆప్టికల్‌ షాపుల్లో ‘డాక్టర్లు’ ఎవరు?

నోటీసులతోనే సరిపెడుతున్నారా?

కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనిలో ఆరోగ్య సేవలు ‘నియంత్రణలేని వ్యవస్థ’గా మారుతున్నాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు ఇటీవల జిల్లా వైద్యాధికారులు నిర్వహించిన తనిఖీల్లో రిజిస్ట్రేషన్లు లేకుండా ఆస్పత్రులు నడుస్తున్న బాగోతాలు బహిర్గతం చేశాయి. ముఖ్యంగా కంటి ఆస్పత్రులు, ఆప్టికల్‌ షాపులు నిబంధనలు అతిక్రమిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అనుమతుల్లేని ఆసుపత్రుల కార్యకలాపాలు

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ కె.ప్రమోద్‌ కుమార్‌ ఇటీవల గోదావరిఖనిలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. రెండు కంటి ఆసుపత్రులు ఎలాంటి అనుమతులు లేకుండానే నడుస్తున్నట్టు గుర్తించినట్లు డీఎంహెచ్‌వో గురువారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. లక్ష్మీనగర్‌లోని ఉమాశంకర్‌ కంటి ఆస్పత్రితోపాటు శ్రీనివాస్‌ కంటి ఆస్పత్రులు రిజిస్ట్రేషన్‌ లేకుండా నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వెంటనే వాటికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.

చట్టాలు ఉన్నా అమలు ఎక్కడ?

క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ 2010 ప్రకారం అన్ని ఆసుపత్రులు, కంటి క్లినిక్స్‌, డయాగ్నొస్టిక్‌, క్లినిక్‌లు, స్కానింగ్‌ సెంటర్లు, ఫిజియోథెరఫీ కేంద్రాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ పొందాలి. కానీ చాలా కేంద్రాలు ఈ చట్టాన్ని పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రులు, షాపుల ముందు తప్పుడు బోర్డులు పెట్టి, నకిలీ వైద్యం అందిస్తున్నారని ఆరోపణలున్నాయి.

చూపుతో చెలగాటం.. ప్రమాదకర పరిణామాలు

అర్హతలేని వ్యక్తులు కంటి పరీక్షలు చేయడం వల్ల తప్పుడు నిర్ధారణలు జరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న పొరపాటు కూడా శాశ్వత చూపు నష్టానికి దారితీయవచ్చని చెబుతున్నారు.

సమాధానం లేని కీలక ప్రశ్నలు

అనుమతులు లేకుండా ఆసుపత్రులు నడుస్తున్నప్పటికీ డాక్టర్లు ఎందుకు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు? ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న ఈ పరిస్థితిపై జిల్లా వైద్యాధికారులు, మెడికల్‌ అసోసియేషన్‌ ఎందుకు స్పందించడం లేదు? అనే కీలక ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ముందుకు రావడం లేదు.

కఠిన చర్యలే పరిష్కారం

వైద్యరంగంలో అభివృద్ధి చెందుతున్న గోదావరిఖనిలో ఇలాంటి నిర్లక్ష్యం కొనసాగడం ఆందోళనకరం. వెంటనే కఠిన చర్యలు తీసుకుని, ఆరోగ్యరంగాన్ని క్రమబద్ధీకరించకపోతే పరిస్థితి మరింత విషమించవచ్చని స్థానిక ప్రజలు హెచ్చరిస్తున్నారు.

నిబంధనల ప్రకారం అర్హత కలిగిన వైద్యులే కంటి పరీక్షలు నిర్వహించాలి. కానీ కొంతమంది వ్యాపారులు స్వయంగా పరీక్షలు చేస్తున్నారు. మందులు రాస్తున్నారు. కంటి చికిత్స కూడా నిర్వహిస్తున్నారు. డాక్టర్ల పేర్లతో బోర్డులు పెట్టి ప్రజలను నమ్మిస్తున్నా, వాస్తవానికి అక్కడ వైద్యులు లేకపోవడం గమనార్హం.

అధికారులు తనిఖీలు చేసి నోటీసులు జారీ చేయడమే తప్ప, లైసెన్సులు రద్దు చేయడం, జరిమానాలు విధించడం వంటి కఠిన చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటం అడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement