పిల్లల ఎదుగుదలను పరిశీలించాలి | - | Sakshi
Sakshi News home page

పిల్లల ఎదుగుదలను పరిశీలించాలి

Apr 24 2026 6:32 AM | Updated on Apr 24 2026 6:32 AM

● కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి: పిల్లల ఎదుగుదలను నిరంతరం పరిశీలించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో సంక్షేమ శాఖ పనితీరుపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంగన్‌వాడీలను సూపర్‌వైజర్లు క్రమం తప్పకుండా సందర్శించి, నమోదు చేసిన ప్రతీ చిన్నారి హాజరు శాతం పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. హాజరు మెరుగులో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇండస్ట్రియల్‌ ప్రాంతాలు, ఇటుక భట్టీలు (బ్రిక్‌ కిల్న్‌లు) వంటి ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లల వివరాలను సేకరించాలని, ఆ ప్రాంతాల్లో పిల్లలకు అవసరమైన సౌకర్యాలను గుర్తించి పరిశ్రమల ద్వారా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేణు, అధికారులు కవిత, అలేఖ్య, సంపదకుమారి, అనిల్‌కుమార్‌, జితేందర్‌, కుమారస్వామి, ఆసిఫ్‌, ఉమా తదితరులు పాల్గొన్నారు.

డీఎంహెచ్‌వో కార్యాలయ సూపరింటెండెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ సస్పెన్షన్‌

జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఎండీ అజీమ్‌తో పాటు సీనియర్‌ అసిస్టెంట్‌ రామును సస్పెన్షన్‌ చేస్తూ కలెక్టర్‌ శ్రీహర్ష ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో కొత్తగా నియమితులైన ల్యాబ్‌ టెక్నీషియన్ల వేతనాలు ఐఎఫ్‌ఎంఎస్‌ పోర్టర్‌లో ప్రాసెస్‌ చేయడం కోసం నగదు డిమాండ్‌ చేసినట్లు ఫిర్యాదులు అందగా ప్రాథమిక విచారణలో అవకతవకలు గుర్తించినట్లు తెలిపారు. అందుబాటులో ఉన్న సాక్ష్యాలను పరిశీలించి వారిని సస్పెన్షన్‌ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

26 నుంచి స్వీయ గణన

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వీయ గణనను జిల్లాలో ఈనెల 26నుంచి మే 10వరకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ శ్రీహర్ష ఒక ప్రకటనలో తెలిపారు. పౌరులు డిజిటల్‌ విధానంలో ఎటువంటి ఆటంకం లేకుండా ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌ ద్వారా తమ ఇంటి వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు.

ఎల్కలపల్లి పాఠశాల సందర్శన

ఫెర్టిలైజర్‌సిటీ: స్వచ్ఛ విద్యాలయాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన పాలకుర్తి మండలం ఎల్కలపల్లి మండల పరిషత్‌ పాఠశాలను గురువారం కలెక్టర్‌ శ్రీహర్ష సందర్శించారు. పాఠశాల ఆవరణలో పచ్చని చెట్లతో సుందరంగా తీర్చిదిద్దిన పాఠశాల హెచ్‌ఎం లక్ష్మీనారాయణను అభినందించారు. టీచర్‌ పేరెంట్‌ మీటింగ్‌లో పాల్గొన్నారు. డీఈవో శారద, డీపీవో కవిత, ఎంఈవో విమల, పాఠశాల చైర్మన్‌ రఘున, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement