పెద్దపల్లి/గోదావరిఖనిటౌన్/మంథని: ఆర్టీసీ ఉద్యోగులు న్యాయమైన డిమాండ్ల సాధనకు చేపట్టిన సమ్మె రెండో రోజు కొనసాగింది. గురువారం ప్రైవేటు సిబ్బందితో ఆర్టీసీ బస్సులను నడిపినప్పటికీ రాజీవ్ రహదారి వెంట మాత్రమే నడిచాయి. గ్రామీణ ప్రాంతాలకు బస్సులు నడవక పోవడంతో ఉద్యోగులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓవైపు మండుటెండలు.. మరోవైపు సమ్మె జరుగుతుండటంతో ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు వెళ్లేందుకు నానా ఇక్కట్ల పాలయ్యారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాల్లో తమ ప్రయాణాన్ని కొనసాగించారు.
గోదావరిఖనిలో మోకాళ్లపై కూర్చొని నిరసన
ప్రైవేటు డ్రైవర్లతో బస్సులను నడిపి ఆర్టీసీ సమ్మెను నిర్వీర్యం చేయొద్దని కోరుతూ గురువారం గోదావరిఖనిలో ఉద్యోగులు డిపో ఎదుట మోకాళ్లపై కూర్చొని దండాలు పెడుతూ మా కడుపు మీద కొట్టొద్దంటూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఖని ఆర్టీసీ చైర్మన్ వంగర శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని అన్నారు. దీనికి ప్రైవేటు డ్రైవర్లు అర్థం చేసుకొని సహకరించాలని కోరారు. సీపీఐ నాయకులు మద్దతు తెలిపి సమ్మెలో పాల్గొన్నారు. ఖని ఆర్టీసీ జేఏసీ నాయకులు ఇందిరాదేవి, మాధవి, కేకే రెడ్డి, బి.రమేశ్. సీపీఐ నాయకులు తాండ్ర సదానందం, కె.కనకరాజు, కరీం, రమేశ్‌కుమార్, ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.


