బదిలీల సందడి | - | Sakshi
Sakshi News home page

బదిలీల సందడి

Apr 22 2026 7:54 AM | Updated on Apr 22 2026 7:54 AM

తొలిదశ : మే ఒకటోతేదీ నుంచి 7వ రోజు వరకు ఆర్థిక, సంబంధిత శాఖల ఉద్యోగుల యూనియన్లతో చర్చించి బదిలీ ప్రక్రియ ఖరారు చేస్తారు.

రెండోదశ : లో మే 8 నుంచి 15వ తేదీ వరకు ఉద్యోగులు తమ ఐచ్ఛికాలతో కూడిన దరఖాస్తులను సమర్పించాలి.

మూడోదశ : మే 16 నుంచి 24వరకు దరఖాస్తుల పరిశీలన, బదిలీల విధానం ప్రకారం వాటిని క్రమబద్ధీకరించడం, కౌన్సెలింగ్‌, తదనుగుణంగా మాస్టర్‌ జాబితా రూపొందిస్తారు.

నాలుగోదశ: మే 25 నుంచి 31వ తేదీవరకు బదిలీ ఉత్తర్వులను జారీచేస్తారు. అప్పటినుంచి మూడోరోజున ఉద్యోగులు తమ పాతఉద్యోగ స్థానం నుంచి విడుదలైనట్లుగా పరిగణిస్తారు.

సాక్షి పెద్దపల్లి: ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చి తీపి కబురు అందించింది. బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభు త్వం అధికారికంగా ఉత్తర్వులు జారీచేసింది. దీని ద్వారా మే ఒకటోతేదీ నుంచి మే 31వ తేదీ వరకు బదిలీల ప్రక్రియ కొనసాగనుంది.

పారదర్శకతకు పెద్దపీట

పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, అటు పరిపాలన సౌలభ్యం, ఇటు ఉద్యోగుల వ్యక్తిగత అవసరాలను సమన్వయం చేస్తూ ప్రభుత్వం కొత్త నిబంధనలను రూపొందించి కీలక నిర్ణయం తీసుకుంది. 2024 ఆగస్టు ఒకటోతేదీ నుంచి సాధారణ బదిలీలపై నిషేధం విధిస్తూ గతేడాది జూలై 31న జీవో నంబరు 87 జారీ చేసింది. దీనిని ఎత్తివేస్తూ ప్రభుత్వం తాజాగా జీవో 38 విడుదల చేసింది. ఆరోపణలు, ఫిర్యాదులకు తావులేకుండా సకాలంలో సంబంధిత శాఖలు ప్రక్రియను నిర్వహించాలని ఆదేశించింది. బదిలీల్లో ఏవైనా ఆరోపణలు, ఫిర్యాదులు వస్తే ఆయా శాఖల అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. మార్గదర్శకాలకు విరుద్ధంగా బదిలీలు నిర్వహించరాదని సూచించింది. ఈక్రజుమంలో మే నెల మొత్తం బదిలీల సందడి నెలకొనగా, జూన్‌ ఒకటి నుంచి బదిలీలపై మళ్లీ నిషేధం అమలులోకి వస్తుందని.. ఆలోపు ప్రక్రియ ను పూర్తిచేయాలని స్పష్టం చేసింది. జిల్లావ్యాప్తంగా గెజిటెడ్‌, నాన్‌ గెజిటెడ్‌, నాలుగో తరగతి ఉద్యోగులు, ఇతరత్రా కలిపి సుమారు 11వేల మంది వరకు ఉద్యోగులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

మూడేళ్ల సర్వీసు పూర్తిచేస్తేనే..

మూడేళ్ల సర్వీసు కూడా పూర్తికాని ఉద్యోగులను ఈదఫా బదిలీ చేయరాదని ఆదేశించింది. తాజా మార్గదర్శకాల ప్రకారం.. 2026 జనవరి ఒకటో తేదీ నాటికి ఒకేచోట మూడేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులు బదిలీలకు అర్హులు. ఏఒక్క ఉద్యోగిని కూడా ఒకేచోట నాలుగేళ్లకు మించి కొనసాగించకూడదని కచ్చితమైన ఆదేశాలు జారీచేసింది. తద్వారా సుదీర్ఘకాలంగా ఒకేచోట పాతుకుపోయిన వారికిస్థానచలనం కలగనుంది.

ఏ క్యాడర్‌లోనైనా సరే మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 40 శాతానికి మించి బదిలీలు చేయకూడదు. అలాగే 2027 మే 31లోగా ఉద్యోగ విరమణ చేయనున్న వారి అభ్యర్థన మేరకే బదిలీ చేయాలి. ఒకవేళ ప్రస్తుతం ఉన్నచోటే కొనసాగాలనుకుంటే ఇబ్బంది పెట్టకూడదు. భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే.. బదిలీల్లో ప్రాధాన్యత, మినహాయింపులు కల్పించారు. మానసిక సమస్యలున్న పిల్లల తల్లిదండ్రులకు ప్రాధాన్యత కల్పించారు. ప్రభుత్వ ఉద్యోగులు మే ఒకటో తేదీనుంచి తమ దరఖాస్తులను సమర్పించుకోవచ్చు.

2024 నుంచి బదిలీలపై నిషేధం

2024 జూలై 9న జారీచేసిన ఉత్తర్వులతో బదిలీలను అనుమతించారు. తదుపరి జూలై 31, 2024న జీవో 87 విడుదల చేసి నిషేధం విధించారు.

దీంతో ఆగస్టు 1, 2024 నుంచి సాధారణ బదిలీలపై నిషేధం అమల్లోకి వచ్చింది. దీనిద్వారా సాధారణ బదిలీలు పూర్తిగా నిలిపివేశారు. ప్రత్యేక పరిస్థితుల్లోనే ముఖ్యమంత్రి, ఉన్నతాధికారుల అనుమతితో బదిలీలు చేపట్టారు. ఎన్నికల కోడ్‌, పరిపాలనాపరమైన కారణాలు, అంతకుముందు జరిగిన జీవో 317 గందరగోళంతో బదిలీలు నిలిచిపోయాయి. దీంతో వేలమంది ఉద్యోగులు తమ సొంత జిల్లాలకు లేదా అనుకూలమైన ప్రాంతాలకు వెళ్లలేక ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా భార్యాభర్తలు వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తూ ఎదుర్కొంటున్న సమస్యలపై పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేయడంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

మే నెలంతా ట్రాన్స్‌ఫర్లు..

మే ఒకటినుంచి ప్రారంభమయ్యే బదిలీల ప్రక్రియలో అత్యంత పారదర్శకత పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. శాఖల వారీగా ఖాళీల వివరాలను ప్రదర్శించి, కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలు చేపట్టనున్నారు. రాజకీయ జోక్యం లేకుండా, కేవలం సీనియారిటీ, నిబంధనల ప్రకారమే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సంకల్పించింది. దీంతో మే నెల మొత్తం ప్రభుత్వ కార్యాలయాల్లో బదిలీల సందడి నెలకొననుంది.

ఉద్యోగుల స్థానచలనానికి సర్కారు గ్రీన్‌సిగ్నల్‌

మే ఒకటి నుంచి 31వ తేదీ వరకు ట్రాన్స్‌ఫర్స్‌

మూడేళ్లు ఒకేచోట పనిచేసేవారికి అవకాశం

జూన్‌ ఒకటినుంచి బదిలీలపై మళ్లీ నిషేధం

షెడ్యూల్‌ ఇలా..

Advertisement
 
Advertisement
Advertisement