బ్లాక్‌లో వంటగ్యాస్‌ | - | Sakshi
Sakshi News home page

బ్లాక్‌లో వంటగ్యాస్‌

Apr 18 2026 8:35 AM | Updated on Apr 18 2026 8:35 AM

● ఒక్కో సిలిండర్‌ ధర రూ.5వేలు

పెద్దపల్లిరూరల్‌: గ్యాస్‌ సిలిండర్లకు కృత్రిమ కొరత ఏర్పడింది. దీంతో బ్లాక్‌మార్కెట్‌లో ఒక్కో సిలిండర్‌ ధర రూ.5వేలకు పైగా పలుకుతోంది. జిల్లా కేంద్రమైన పెద్దపల్లితోపాటు వివిధ ప్రాంతాల్లో గ్యాస్‌ సిలిండర్ల బ్లాక్‌ దందా సాగుతున్నా అధికార యంత్రాంగం మొక్కుబడి తనిఖీలతోనే సరిపెడుతోందనే విమర్శలున్నాయి. హోటళ్లు, టిఫిన్‌, ఫాస్ట్‌పుడ్‌ సెంటర్లలో వాణిజ్య అవసరాల కోసం వినియోగించాల్సిన సిలిండర్లకు బదులుగా గృహవినియోగ సిలిండర్లనే వాడుతుండడం గమనార్హం. వ్యాపారులు, ఇతరుల అవసరాలను బట్టి కొంతమంది గ్యాస్‌స్టౌ రిపేరర్లు సిలిండర్ల బ్లాక్‌దందా కొనసాగిస్తున్నట్టు సమాచారం. ధరలు పెరిగాయంటూ హోటల్‌, టిఫిన్‌ సెంటర్ల యజమానులు సైతం ఆహార పదార్థాల ధరలను పెంచేశారు.

యథేచ్ఛగా రీఫిల్లింగ్‌

పెద్దపల్లితోపాటు వివిధ ప్రాంతాల్లో గ్యాస్‌ రీఫిల్లింగ్‌ దందా కొనసాగుతోంది. కొందరు గ్యాస్‌ స్టౌ రిపేరర్లు తమవద్ద ఉన్నసిలిండర్‌లో నుంచి చిన్న సిలిండర్‌ (కిలోల కొద్దీ)లోకి గ్యాస్‌ను అవసరమున్నంత రీఫిల్లింగ్‌ చేస్తున్నట్టు సమాచారం. కిలోకు రూ.350 నుంచి రూ.400 వకఎ వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. బ్యాచిలర్లు, అత్యవసరమున్న వారు వీరిని ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇళ్లలోనే గ్యాస్‌ రీఫిల్లింగ్‌ చేస్తుండడంతో ఏ క్షణాన ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోననే ఆందోళన పరిసర ప్రాంత ప్రజల్లో వ్యక్తమవుతోంది. జిల్లాకేంద్రంలోని సాగర్‌రోడ్డు, కోఠి ప్రాంతాల్లో రీఫిల్లింగ్‌ దందా సాగుతున్నట్టు సమాచారం. సంబంధిత శాఖల అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement