కో – ఆప్షన్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ | - | Sakshi
Sakshi News home page

కో – ఆప్షన్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌

Apr 17 2026 10:56 AM | Updated on Apr 17 2026 10:56 AM

ఈనెల 23 వరకు దరఖాస్తుల స్వీకరణ

బల్దియా కమిషనర్‌ అరుణశ్రీ

కోల్‌సిటీ(రామగుండం): నగరపాలక పరిపాలనలో అనుభవం, ప్రత్యేక పరిజ్ఞానం కలిగిన వారితోపాటు మైనారిటీలకు ప్రాతినిధ్యం కల్పించేలా కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రామగుండం బల్దియా కమిషనర్‌ అరుణశ్రీ తెలిపారు. ఈమేరకు గురువారం నోటిఫికేషన్‌ జారీచేశారు. తెలంగాణ మున్సిపాలిటీస్‌ కో ఆప్షన్‌ మెంబర్‌ రూల్స్‌ ప్రకారం మొత్తం ఐదుగురు సభ్యులను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో పురపాలక పరిపాలనలో ప్రత్యేక అనుభవం కలిగిన ముగ్గురు సభ్యులు ఉంటారని, వీరిలో ఒకరు మహిళ తప్పనిసరి అని ఆమె అన్నా రు. మైనారిటీలకు చెందిన ఇద్దరు సభ్యులుగా ఉంటుండగా, ఈ ఇద్దరిలో ఒకరు తప్పనిసరిగా మహిళ ఉంటారని పేర్కొన్నారు. కో ఆప్షన్‌ సభ్యులుగా ఎన్నికలో పాల్గొనేవారు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఓటరు జాబితాలో నమోదు అయి ఉండడంతోపాటు కనీసం 21 సంవత్సరాల వయస్సు పూర్తిచేసి ఉండాలని తెలిపారు. ప్రత్యేక పరిజ్ఞానం వర్గానికి చెందిన అభ్యర్థులు మున్సిపాలిటీ లేదా మున్సిపల్‌ కార్పొరేషన్లలో కనీసం ఐదేళ్లపాటు మేయర్‌, డిప్యూ టీ మేయర్‌, చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ లేదా సభ్యుడిగా పనిచేసి ఉండాలన్నారు. లేదా గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులుగా ఐదేళ్ల అనుభవం ఉండాలని పేర్కొన్నారు. ఇక మున్సిపల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా కనీసం మూడు సంవత్సరాలు పనిచేసిన న్యాయవాదులు లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో గెజిటెడ్‌ హోదాలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన వారూ అర్హులన్నారు. అర్హతలు, ఆసక్తి గలఅభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాలతో ఈనెల 23వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలోని టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో దరఖాస్తులు సమర్పించాలని కమిషనర్‌ సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement