మందు.. బిర్యానీతో విందు | - | Sakshi
Sakshi News home page

మందు.. బిర్యానీతో విందు

Apr 15 2026 8:32 AM | Updated on Apr 15 2026 8:32 AM

గోదావరిఖని: నగరంలోని సింగరేణి ఏరియా ఆస్పత్రిని కార్పొరేట్‌స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు. కానీ, నిర్వహణపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఆస్పత్రిలోకి ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారనేదానిపై నిఘా పెట్టడంలేదు. ప్రధానంగా ఇన్‌పేషెంట్లు ఎలా వ్యవహరిస్తున్నారు, వారి తాలూకు అటెండెంట్లు ఏం చేస్తున్నారనే దానిపైనా నిఘా కరువైంది. సింగరేణి సంస్థకే గుండెకాయగా ఉన్న గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో రామగుండం రీజియన్‌తోపాటు, బెల్లంపల్లి రీజియన్‌లోని కార్మిక కుటుంబాలకు వైద్యం అందిస్తోంది. ఈక్రమంలో ఈ ఆస్పత్రి నిత్యం బిజీగా మారింది. కార్డియాలజీ సెంటర్‌ ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేస్తున్నారు. దీంతో సందర్శకుల రాకపోకలను నియంత్రించాల్సి అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

నియంత్రణపై నిఘా ఏది..?

ఇన్‌ పెషేంట్‌, అవుట్‌ పేషెంట్‌, సందర్శకుల రాకపోకలతో సింగరేణి ఏరియా ఆస్పత్రి నిత్యం బిజీగా ఉంటోంది. అయితే చెక్‌పోస్టుల ఏర్పాటు, వచ్చే, వెళ్లేమార్గం, ఎంతమంది వస్తున్నారనే అంశాలపై నియంత్రణ లేకుండాపోతోంది.

సెక్యూరిటీ గార్డులపై దాడితో..

సింగరేణి ఏరియా ఆస్పత్రి వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డులపై దాడికి పాల్పడిన సంఘటతో పేషెంట్ల భద్రత తీరు ప్రశ్నార్థకంగామారింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇన్‌పె షేంట్లకు మద్యం తీసుకురావడం, బిర్యానీలతో విందు చేసుకోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. సింగరేణి సెక్యూరిటీ సిబ్బందితోపాటు వైద్యసిబ్బందితో కూడా దురుసుగా ప్రవర్తించిన తీరు ఆందోళనకు గురిచేస్తోంది.

మార్గదర్శకాలు రూపొందించాలి

సింగరేణి ఏరియా ఆస్పత్రి కార్పొరేట్‌స్థాయి వైద్యం అందించేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే కార్డియాలజీ సెంటర్‌ను ప్రారంభించనున్నారు. డయాలసిస్‌ యూనిట్‌తోపాటు ఎక్విప్‌మెంట్‌ను యాజమాన్యం కొనుగోలు చేసింది. కానీ, పరిశుభ్రత నిర్వహణ, షేపెంట్ల అటెండెంట్ల రాకలో నియంత్రణ కోల్పోతోంది. ఇన్‌పేషెంట్లకు మార్గదర్శకాలు తదితర అంశాలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి నిబంధనలు రూపొందించాలని కోరుతున్నారు.

సింగరేణి ఏరియా ఆస్పత్రిలో ఇష్టారాజ్యం

సందర్శకులు, పేషెంట్ల వ్యవహారంపై పర్యవేక్షణ లోపం

సెక్యూరిటీ గార్డులు, వైద్య సిబ్బందిపై దుండగుల దాడులు

ఆందోళన కలిగిస్తున్న వరుస సంఘటనలు

సింగరేణి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ పేషెంట్‌ను పరామర్శించేందుకు బంధువులు వెళ్లారు. అంతటితో ఆగకుండా మందు, బిర్యానీతో విందు చేసుకున్నారు. ఇదేమని ప్రశ్నించిన సెక్యూరిటీ గార్డులపై దాడి చేశారు. గొడవను ఆపేందుకు వెళ్లిన పోలీసులతోనూ దురుసుగా ప్రవర్తించారు. గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో రెండ్రోరోజుల క్రితం ఈఘటన చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement