
అభిప్రాయ సేకరణ.. దరఖాస్తుల స్వీకరణ!
హస్తసారథుల అన్వేషణ ప్రారంభం రేపు ఉమ్మడిజిల్లాకు పీసీసీ పరిశీలకులు ఆరురోజులపాటు పర్యటన ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రజాస్పందన ఆధారంగా మూడు పేర్లు ఢిల్లీకి దీపావళి నాటికి డీసీసీల ఖరారుకు అవకాశం
పోటీ పడుతున్నది వీరే..
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడిన నేపథ్యంలో అధికార పార్టీ జిల్లాలపై దృష్టి సారించింది. కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)లకు కొత్త అధ్యక్షులను నియమించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా ప్రతీ జిల్లాకు పీసీసీ పరిశీలకులను నియమించింది. వీరంతా ఈనెల 13న ఉమ్మడి జిల్లాకు రానున్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రజా మద్దతు ఉన్న నాయకుడిని గుర్తించి డీసీసీ అధ్యక్షుడిగా నియమించాలన్న సంకల్పంతో వీరంతా పని చేయనున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో మమేకమై ఎవరి బలాబలాలు ఎంతెంత? అన్న విషయంపై అవగాహనకు రానున్నారు. ఏఐసీసీ పరిశీలకులు.. శ్రీనివాస్ మానే నేతృత్వంలో పీసీసీ పరిశీలకుల బృందం ఉమ్మడి జిల్లాకు రానుంది. వీరిలో ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి కరీంనగర్ కార్పొరేషన్, ఆత్రం సుగుణ కరీంనగర్, చిట్ల సత్యనారాయణ సిరిసిల్ల, తూర్పు జయప్రకాశ్ రెడ్డి జగిత్యాల, ఎండీ.ఖాజా ఫక్రుద్దీన్ రామగుండం కార్పొరేషన్, కేతూరి వెంకటేశ్, గిరిజాషెట్కర్ పెద్దపల్లి రానున్నారు. చామల కిరణ్‌కుమార్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆయన రాక సందిగ్ధంలో పడింది.
ముగ్గురి కోసం మధనం
కాంగ్రెస్ వర్గాలు తెలిపిన ప్రకారం.. ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు మొత్తం ఆరురోజులపాటు డీసీసీ పరిశీలకులు జిల్లాల్లో పర్యటిస్తారు. సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి పార్టీ ఆలోచనలు వివరిస్తారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్న ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. వీలును బట్టి పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారో వారి ఆలోచనలు, ప్రణాళికలు ఇంటర్వ్యూ తరహాలో అడిగి తెలుసుకుంటారు. అనంతరం పార్టీ కార్యకర్తలు, ముఖ్యనాయకులతో సమావేశ మై వారి అభిప్రాయాలు సేకరిస్తారు. అలాగే క్షేత్రస్థాయిలో పర్యటించి పార్టీ బలాబలాలు, ఏ నేతకు ఎంత ఆదరణ ఉందో తెలుసుకుంటారు. అనంతరం ఆశావహుల్లో నుంచి ముగ్గురిని ఎంపిక చేస్తారు. ఆ జాబితాను తొలుత కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌కు పంపిస్తారు. ఈ జాబితాను స్క్రూటినీ చేసి తిరిగి రాష్ట్రానికి పంపుతారు. అక్కడ దీపావళి నాటికి టీపీసీసీ చీఫ్, సీఎం, మంత్రి భట్టి విక్రమార్క, సంబంధిత ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రులు కలిసి ప్రతీ జిల్లాలో ముగ్గురిలో ఒకరిని డీసీసీ ప్రెసిడెంట్‌గా ఖరారు చేస్తారు.
కరీంనగర్ డీసీసీకి పార్లమెంట్ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి పోటీ పడుతున్నారు. సిరిసిల్ల డీసీసీ రేసులో.. గడ్డం నర్సయ్య, కె.చక్రధర్‌రెడ్డి, నేవూరి వెంకటరెడ్డి, సంగీతా శ్రీనివాస్ ఉన్నారు. జగిత్యాల డీసీసీకి జువ్వాడి కృష్ణారావు, సుజిత్‌రావు, కొమొరెడ్డి కరంచంద్ రేసులో ఉన్నారు. పెద్దపల్లి జిల్లా నుంచి సారయ్యగౌడ్, శశిభూషణ్ కాచే, బోషానబోయిన రమేశ్‌గౌడ్, తొట్ల తిరుపతియాదవ్, కోలేటి మారుతి, చొప్పరి సదానందం డీసీసీ ప్రెసిడెంట్ పదవిని ఆశిస్తున్నారు.

అభిప్రాయ సేకరణ.. దరఖాస్తుల స్వీకరణ!