
కార్మిక కుటుంబాలపై అద్దెభారం
కమ్యూనిటీహాళ్లలో అసౌకర్యాలు అమాంతం అద్దె పెంచిన సింగరేణి రూ.558 నుంచి రూ.15వేలకు పెంపు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కార్మికులు, కార్మిక సంఘాలు
గోదావరిఖని: సింగరేణి కమ్యూనిటీ(ఫంక్షన్)హాళ్ల అద్దె పెంపుపై కార్మిక కుటుంబాలు, కార్మిక సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అసలే అసౌకర్యాలు తాండవిస్తున్న కమూ న్యిటీ హాళ్లలో వసతులు కల్పించాల్సింది పోయి రెంట్ పెంచడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నాయి.
పనిచేయని ఏసీలు..
యైక్లయిన్‌కాలనీ సింగరేణి కమ్యూనిటీహాల్‌లో అన్నీ అసౌకర్యాలే ఉన్నాయి. పనిచేయని ఏసీలు, నిర్వహణ లోపం కార్మికులను వెక్కిరిస్తున్నాయి. కమ్యూనిటీహాల్‌ను ఆధునికీకరించినా పెద్దగా ప్రయోజనం లేదని కార్మికులు పెదవివిరుస్తున్నారు. కార్మిక కుటుంబాల సౌకర్యార్థం నాలుగు దశాబ్దాల క్రితం కమ్యూనిటీహాల్ నిర్మించారు. వివాహాలు, ఇతర శుభకార్యాల కోసం వినియోగించేలా తీర్చిదిద్దారు. సుమారు ఐదు వేల కుటుంబాలకుపైగా నివాసం ఉంటున్న ఈ ప్రాంతంలో ప్రతీకార్యక్రమానికి కమ్యూనిటీహాల్ వినియోగం కీలకంగా మారింది.
కార్మికుల కష్టార్జితమే..
సీఎస్‌ఆర్ నిధుల పేరిట రూ.కోట్లు సింగరేణి ప్రభావిత, నిర్వాసిత గ్రామాలకు కేటాయిస్తున్న యాజమాన్యం.. అదే కార్మికుల కష్టంతో లాభాలు ఆర్జిస్తోంది. కానీ, వారికి కనీస సౌకర్యాల కల్పనలో వ్యాపార ధోరణితో వ్యవహరిస్తోంది.
రెండేళ్ల క్రితం ఆధునికీకరణ..
మారుతున్న కాలానికి అనుగుణంగా రెండేళ్ల క్రితం సింగరేణి కమ్యూనిటీ హాల్‌ను ఏసీ హాల్‌గా ఆధునికీకరించారు. టైల్స్, కలరింగ్, లైట్లతో అందంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం సౌకర్యవంతంగా ఉన్నా.. అద్దెభారీగా పెంచుతూ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం కార్మికులకు ఇబ్బందిగా మారింది.
గతంలో రోజూ అద్దె రూ.558
గతంలో సింగరేణి కమ్యూనిటీహాల్‌లో ఒకసారి ఫంక్షన్ నిర్వహణకు రూ.558లు అద్దెతోపాటు విద్యుత్, క్లీనింగ్ చార్జీలు వసూలు చేసేవారు. ఏసీ కమ్యూనిటీ హాల్‌గా మార్చాక అద్దె పెంచాలని అధికారులు నిర్ణయించారు. కానీ, అప్పటి గుర్తింపు కార్మిక సంఘం ఆ ప్రతిపాదనను వ్యతిరేకించింది. దీంతో అద్దె పెంపు నిర్ణయాన్ని వాయిదా వేశారు.
ఇప్పుడు రూ.15వేలకు పెంపు..
సింగరేణి కార్మిక కుటుంబాల సౌకర్యార్థం యాజమాన్యం నిర్మించిన కమ్యూనిటీహాళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. వివాహాది శుభకార్యాలు, ఇతర వేడుకలు, ఉత్సవాలకు ఇదే కమ్యూనిటీహాల్‌ను ఎంచుకుంటారు. కమ్యూనిటీ హాల్ అభివృద్ధిపై సమీక్షించిన అధికారులు అద్దె భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం సింగరేణి కార్మికులకు అయితే రోజుకు రూ.15వేల అద్దెతోపాటు క్లీనింగ్, విద్యుత్ చార్జీలు అదనంగా వసూలు చేస్తున్నారు. కార్మికేతరులకుఅయితే రోజూ అద్దె రూ.25వేలతోపాటు విద్యుత్, క్లీనింగ్ చార్జీలు అదనంగా వసూలు చేయాలని నిర్ణయించారు. అద్దెపెంపుపై కార్మికులు, కార్మికేతరులు, కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్జీ–1, 3 ఏరియాల్లో నామ మాత్రపు అద్దె ఉంటే ఆర్జీ–2లో అధికంగా వసూలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల వైఫల్యమే ఇందుకు కారణమని ఆరోపణలు వస్తున్నాయి.

కార్మిక కుటుంబాలపై అద్దెభారం