
ఎయిర్‌పోర్టుకు తొలిఅడుగు
● ప్రీఫిజిబిలిటీ నివేదిక తయారీకి నిధులు ● బీఆర్‌వో జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం
గోదావరిఖని/రామగుండం: అంతర్గాం మండలంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు కల సాకారం దిశగా మరో ముందడుగు పడినట్లు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ శనివారం తెలిపారు. ఈమేరకు జీవో కాపీ విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం శనివారం అధికారికంగా రూ.40.53 లక్షలు మంజూరు చేసి, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు ప్రీ–ఫిజిబిలిటీ స్టడీ ఫీజు చెల్లించిందని ఆయన పేర్కొన్నారు. దీంతో అంతర్గాంలో ఎయిర్‌పోర్ట్ స్థాపన దిశగా ఒక చారిత్రక ముందడుగు పడిందన్నారు. రవాణా, రోడ్లు, భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ) నిధులకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. జిల్లాలోని అంతర్గాం మండలంలో 591ఎకరాలపై గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు ప్రతిపాదనకు అధ్యయనం చేస్తారన్నారు. రెండేళ్లుగా సాగుతున్న ఎయిర్‌పోర్ట్ కల ఇప్పుడు సాకారం అవుతోందని, దీనిద్వారా పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలకు, సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్, ఇతర వాణిజ్య వ్యాపార వర్గాలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రరాజధానికి ప్రత్యక్ష కనెక్టివి ఏర్పడుతుందని, నూతన ఆర్థిక, పారిశ్రామిక అవకాశాలను తీసుకొస్తుందని ఎంపీ అభిప్రాయపడ్డారు. ప్రీ–ఫిజిబిలిటీ స్టడీ తర్వాత సెంటర్ ఫిజిబిలిటీ స్టడీ చేపడుతుందని వివరించారు. ఎయిర్‌పోర్ట్ స్థాపించేంత వరకు తన పోరాటం కొనసాగుతుందని ఎంపీ వంశీకృష్ణ స్పష్టం చేశారు.

ఎయిర్‌పోర్టుకు తొలిఅడుగు