
ఎన్నికలు ఏవైనా ఎగిరేది బీజేపీ జెండానే
సుల్తానాబాద్: ఎన్నికలు ఏవైనా ఎగిరేది బీజేపీ జెండానే అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. గురువారం సుల్తానాబాద్‌లోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాల్‌లో పార్టీ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడారు. 9ఏళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రంలో ఒరిగింది ఏమి లేదని, మార్పు కోరి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెడితే అరచేతిలో వైకుంఠం చూపెడుతున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీని ఆదరించేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారన్నారు. బీజేపీ కార్యకర్తలు వార్డు మెంబర్ నుంచి జెడ్పీటీసీ వరకు పోటీలో నిలబడి బీజేపీ జెండాను ఎగురవేయాలని సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఽపథకాలను గ్రామాల్లో గడప గడపకూ ప్రచారం చేయాలని తెలిపారు. పార్టీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు మీస అర్జున్‌రావు, సీనియర్ నాయకుడు గొట్టెముక్కుల సురేశ్‌రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి అశోక్‌రావు, సౌదరి మహేందర్‌యాదవ్, రాజేంద్రప్రసాద్, రమేశ్, ప్రవీణ్‌కుమార్, శ్రీనివాస్ గౌడ్, రాజన్నపటేల్, తిరుపతి యాదవ్‌లతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.