
పక్కా సమాచారం
జాప్యానికి ఇక చెక్ అవినీతికి ఆస్కారం లేకుండా ఇందిరమ్మ ఇళ్ల యాప్ ఇక లబ్ధిదారులే నేరుగా అప్‌లోడ్ చేసే అవకాశం బిల్లుల సత్వర చెల్లింపునకు మార్గం సుగమం ఇళ్లు, బిల్లుల సమస్త సమాచారం అంతా ఇక ఆన్‌లైన్‌లోనే.. సమస్యల పరిష్కారానికి టోల్‌ఫ్రీ నంబరు 1800 5995 991
పారదర్శకం..
పెద్దపల్లిరూరల్: పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్రప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మేలుచేసేందుకు ప్రత్యేక యాప్ రూపొందించింది. ప్రస్తుతం దీనిని లబ్ధిదారులకు అందుబాటులోకి తీ సుకొచ్చింది. దీనిద్వారా పూర్తిపారదర్శకంగా, అవి నీతికి తావులేకుండా పేదలకు ప్రయోజనం చేకూరుతుందని చెబుతోంది. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు 5,986 మంజూరు కాగా, అందులో 4,048 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. బేస్‌మెంట్ స్థాయిలో 1,505 ఇళ్లు, గోడలస్థాయిలో 200 ఇళ్లు, స్లాబ్ పూర్తయినవి మరో 220 ఇళ్లు ఉన్నాయని అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
అవినీతికి చెక్ పెట్టేలా..
ఇందిరమ్మ పథకం ద్వారా ఇంటి నిర్మాణం చేపట్టిన లబ్ధిదారుకు బిల్లు మంజూరు కావాలంటే సంబంధి త అధికారులు ఎంతోకొంత ముట్టజెప్పాలని ఒత్తిడి చేస్తున్నారనే ఫిర్యాదులు అధికారులు, ప్రజాప్రతినిధులకు అందుతున్నాయి. ఎంతోకొంత ఇవ్వకుంటే బిల్లు చెల్లింపులో జాప్యమవుతోందని అంటున్నారు. దీంతో లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరిగి వేసారిపోయే పరిస్థితులు ఉన్నట్లు గుర్తించిన ఉన్నతాధికారులు.. లబ్ధిదారుల ఇబ్బందులు దూరం చేసేలా ‘యాప్’ అమల్లోకి తీసుకొచ్చారు.
లబ్ధిదారే అప్‌లోడ్ చేసుకునే అవకాశం..
ఇందిరమ్మ ఇంటి ఫొటోలను లబ్ధిదారు స్వయంగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని గృహ నిర్మాణ శాఖ అధికారులు కల్పించారు. సంబంధిత అధికారులు బిల్లులను అప్‌లోడ్ చేయడంలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడం తదితర సమస్యలకు ఈ విధానంతో చెక్ పడుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఏ సమస్యకై నా అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని అంటున్నారు.
సమాచారమంతా ఆన్‌లైన్‌లోనే..
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు, లబ్ధిదారు వివరాలు, బిల్లుల చెల్లింపు తదితర సమాచారమంతా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. లబ్ధిదారు ఎ క్కడ ఉన్నా సమాచారాన్ని క్షణంలో యూ నివర్సల్ సెర్చ్‌తో తెలుసుకునేందుకు వీలు కల్పించడం సత్ఫలితాలను ఇస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. తమ బిల్లు ఎవరి వద్ద పెండింగ్‌లో ఉంది, ఏ రోజున ఎంతమొత్తం బ్యాంకు ఖాతాకు బదిలీ చేశారనే వివరాలను ఉన్నచోటు నుంచే తెలుసుకోవచ్చు.
అప్‌లోడ్ ఎలా చేయాలంటే..
ఇబ్బంది ఉండొద్దనే..
ఇందిరమ్మ లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణ ఫొటో, వివరాలను అప్‌లోడ్ చేసే విధానంపై అవగాహన కల్పించేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. మొబైల్ ఫోన్‌లో ఇందిరమ్మ ఇళ్ల యాప్‌ను ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత లబ్ధిదారు తన లాగిన్‌లో సెల్ నంబరు ఎంటర్‌చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి పేరు, సెల్ నంబరు తదితర వివరాలతోపాటు ఫొటో అప్‌లోడ్‌చేయగానే.. ఇంటినిర్మాణ స్థాయి వివరాలు అందుబాటులోకి వస్తాయి. అయితే ఇల్లు నిర్మించే ప్రాంతంలోనే సెల్ ఫోన్‌తో ఫొటో తీయాల్సి ఉంటుంది. అక్కడ కెమెరాలో జియోట్యాగింగ్ విధానంతో వివరాలను నమోదు చేసి సరిచూసుకుని సబ్మిట్ చేయాలి. లబ్ధిదారు సమర్పించిన వివరాలన్నీ సరైనవేనా..? అని సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో సరిచూసుకున్న తర్వాత లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో బిల్లు మొత్తాన్ని జమచేస్తారని అధికారులు తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడొద్దనే ఆలోచనతోనే ఉన్నతాధికారులు సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చారు. లబ్ధిదారులే వాస్తవ వివరాలు అప్‌లోడ్ చేయాలి. ఈ విధానంపై అవగాహన కల్పిస్తున్నాం. ఏమైనా సమస్యలు ఉంటే టోల్‌ఫ్రీ నంబరు 1800 5995 991 ద్వారా కూడా నివృత్తి చేసుకోవచ్చు. బిల్లుల స్టేటస్ కోసం ఇకనుంచి ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు.
– రాజేశ్వర్, పీడీ, హౌసింగ్

పక్కా సమాచారం