
యూరియా.. ఏదయా
పెద్దపల్లిరూరల్: సాగుకు అవసరమైన యూరియా కోసం జిల్లా రైతాంగం ఇంకా తిప్పలు పడుతోంది. జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి అత్యధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. పంటను కాపాడుకోవడంతోపాటు మంచి దిగుబడి సాధించేందుకు యూరియా చల్లే సమయం ప్రస్తుతం ఆసన్నమైంది. దీంతో యూరియా కోసం రైతులు దుకాణాలు, గోదాముల ఎదుట బారులు తీరుతున్నారు. అవసరమైన నిల్వలు లేక వారిలో ఆత్రుత పెరుగుతోంది.
ఇలా రాగానే.. అలా ఖాళీ..
జిల్లాకు చేరుతున్న యూరియా నిల్వలను అవసరమైన ప్రాంతాలను గుర్తించి సరఫరా చేస్తున్నట్లు వ్యవసాయశాఖ అధికారి ఒకరు తెలిపారు. అయితే నిల్వలు చేరుకునే సరికే అక్కడ బారులు దీరిఉన్న రైతులకు పంపిణీ చేస్తున్నారు అధికారులు, సిబ్బంది. దీంతో ఇలా రాగానే.. అలా ఖాళీ అయిపోతోంది. పాలకుర్తి మండలానికి సోమవారం 340 సంచుల యూరియా రాగా గుడిపల్లి, జయ్యారం, కుక్కలగూడూరు గ్రామాల్లోని 191మంది రైతులకు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.
చెక్‌పోస్టులతో నిఽఘా..
జిల్లాకు చేరిన యూరియాను పొరుగు జిల్లాలకు దొ డ్డిదారుల్లో తరలించుకుపోతున్నారని తొలుత ఆరోపణలు వచ్చాయి. దీంతో అక్రమ రవాణాను ని యంత్రించేందుకు జిల్లావ్యాప్తంగా ఐదు చెక్ పోస్టు లు ఏర్పాటు చేసి నిఘా పెంచారు. జిల్లాలోని సుందిళ్ల, అడవిసోమన్‌పల్లి, ఖమ్మంపల్లి, రామగుండం, గుంపులలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వాటివ ద్ద 220 బస్తాలను పొరుగు జిల్లాలకు తరలిస్తుండ గా అధికారులు పట్టుకున్నారు. ఒక్కో వాహనానికి రూ.10వేల చొప్పున జరిమానా విధించారు.
ఈ పాస్ నమోదులో అంతంతే..
యూరియా పంపిణీ సరైన పద్ధతిలో సాగడం లేదన్న వాదనలు ఉన్నాయి. ఏ రైతుకు ఎంతభూమి ఉంది, ఏ పంట సాగు చేశారు, ఎంత యూరియా అవసరం, ఇప్పటివరకు ఎంత తీసుకున్నాడనే వివరాలను ఈ పాస్ మిషన్‌లో నమోదై లేకపోవడంతో పంపిణీ ప్రక్రియ లోపభూయిష్టంగా మారుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతు ఆధార్‌కార్డుతో రాగానే నంబరు రాసుకుని యూరియా ఇస్తుండడంతో మరుసటిరోజే మళ్లీ వచ్చినా ఇవ్వాల్సి వస్తోందని సమాచారం. అయితే ఈ పాస్‌లోనే నిల్వల వివరాలతోపాటు పంపిణీ సమాచారం కూడా వివరంగా ఉంటే కొంత కట్టడి చేయవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
3,200 టన్నులు వస్తుంది
నాలుగైదు రోజుల్లో జిల్లాకు మరో 3,200 మెట్రిక్ టన్నుల యూరియా వస్తుంది. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉత్పత్తి నిలిచిపోవడంతో కొంత ఇబ్బందిగా మారింది. నానో యూరియాపై అవగాహన కల్పించినా రైతులు ఆసక్తి చూపడం లేదు. యూరియాల పంపిణీలో ఇబ్బందులు తొలగిస్తాం.
– శ్రీనివాస్, జిల్లా వ్యవసాయాధికారి
జిల్లా సమాచారం
వరి సాగు విస్తీర్ణం(ఎకరాల్లో) 2,11,780
పత్తి(ఎకరాల్లో) 49,280
మొక్కజొన్న(ఎకరాల్లో) 501
ఉద్యానవన(ఎకరాల్లో) 9,000
యూరియా వివరాలు(మెట్రిక్ టన్నుల్లో)
జిల్లాకు కేటాయింపులు 30,000
చేరిన యూరియా 7,000
ప్రస్తుత నిల్వలు 1,100
ఇంకా రావాల్సింది 3,200

యూరియా.. ఏదయా