
నైపుణ్య శిక్షణ.. ఉపాధి కల్పన
‘టాస్క్.. జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఆధ్వర్యంలో డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్థులకు రెండేళ్లుగా ఉచిత శిక్షణ అందిస్తోంది. వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. ఇందులో టెలిఫెర్మారెన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రత్యేకత చాటుకుంటోంది.
పెద్దపల్లిరూరల్: విద్యావంతులైన యువతలో వృత్తి నైపుణ్యం పెంపొందించి ఉద్యోగావకాశాలు దక్కించుకునేలా ప్రోత్సహించేందుకు వీలుగా రాష్ట్రంలోనే తొలి ‘టాస్క్’ (తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్) కేంద్రం జిల్లా కేంద్రంలో ఇటీవల ఏర్పాటైంది. జిల్లాకు చెందిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రత్యేక చొరవతో అందుబాటులోకి వచ్చిన టాస్క్ సెంటర్‌ను సద్వినియోగం చేసుకునేందుకు విద్యావంతులైన యువత ముందుకు రావాలని అధికారులు సూచిస్తున్నారు.
నైపుణ్యం పెంచుకునేలా..
ప్రస్తుతం ఉద్యోగావకాశాలు దక్కించుకునేందుకు తీవ్రమైన పోటీ ఉంది. ఇందులో నెగ్గేందుకు ప్రతిభానైపుణ్యాలు తప్పనిసరిగా మారాయి. కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసేందుకు డిగ్రీ, ఇంజినీరింగ్, ఎంబీఏ, ఫార్మసీ, పాలిటెక్నిక్ తదితర ఉన్నత విద్యావంతులను టాస్క్ ద్వారా వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించి ఉద్యోగావకాశాలు కల్పించాలనే ప్రధానలక్ష్యంతో టాస్క్ కేంద్రం పనిచేస్తోంది. ప్రస్తుతం వివిధ కాలేజీల్లో చదివే, చదువు పూర్తయిన యువతకు స్పోకెన్ ఇంగ్లిష్‌లో మెలకువలు నేర్పించి ఇంటర్వ్యూలను ఎలా ఎదుర్కోవాలో ఇందులో తర్ఫీదు ఇస్తారు.
జిల్లా యువతకు మేలు..
జిల్లాకు చెందిన విద్యావంతులైన యువతకు మంచి భవిష్యత్ అందించాలనే ఆలోచనతో ప్రభుత్వం జిల్లా కేంద్రంలో టాస్క్ సెంటర్ ఏర్పాటు చేసింది. దీంతో ఈ ప్రాంత యువత వృత్తి నైపుణ్య శిక్షణ పొందేందుకు దూరప్రాంతాలకు వెళ్లే బాధ, ఆర్థికభారం తప్పింది. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన యువతీయువకులకు టాస్క్ సెంటర్‌తో ఎంతో ప్రయోజనం చేకూరనుంది.
10లోగా పేర్లు నమోదు చేసుకోవాలి
జిల్లా కేంద్రంలోని టాస్క్ సెంటర్‌లో డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తిచేసిన విద్యార్థులు నైపుణ్య శిక్షణ ఉచితంగా పొందేందుకు ఈనెల 10లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలి. శిక్షణ అనంతరం మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు పొందేందుకు అవకాశం ఉంది. శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు మంచి వేతనంతో కూడిన ప్యాకేజీలతో కంపెనీల్లో ఉపాధి కల్పిస్తారు.
అందుబాటులో ఉన్న కోర్సులివే..
జిల్లా కేంద్రంలోని టాస్క్ సెంటర్‌లో ఉపాధి అవకాశాలు కల్పించే అనేక కోర్సులు ఉన్నాయి. ఇందులో జావా వెబ్ డెవలప్‌మెంట్ ఫైథాన్, సీ, సీ++, హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్, జువాస్క్రిప్ట్, టాలీవిత్ జీఎస్‌టీ, అప్టిట్యూడ్, రీజనింగ్, సాఫ్ట్‌స్కిల్స్ లాంటి ముఖ్యమైన కోర్సులు అందుబాటులో ఉన్నాయని రీజినల్ సెంటర్ ఇన్‌చార్జి కౌసల్య తెలిపారు. ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు ఈకోర్సుల్లో చేరి ఉపాధి పొందవచ్చని పేర్కొన్నారు. ఆసక్తిగవారు వివరాల కోసం 90595 06807 నంబరులో సంప్రదించాలని కౌసల్య కోరారు.
– జిల్లా ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు
సద్వినియోగం చేసుకోండి
జిల్లా కేంద్రంలోని టాస్క్ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలి. యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచుకోవాలి. ప్రస్తుతం 30 శాతమే ఉన్న ఉపాధి లక్ష్యాలను 60 శాతానికి పెంచేలా టాస్క్ నిర్వాహకులు అవగాహన సదస్సులు నిర్వహించాలి. ఇక్కడ శిక్షణ పొందినవారు మల్టీనేషనల్ కంపెనీల్లో రూ.7లక్షల ప్యాకేజీలతో ఉద్యోగాలు చేస్తున్నారు. – కోయశ్రీహర్ష, కలెక్టర్