
పల్లెపాలనపై పట్టుకు..
గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ పటిష్టం వీఆర్వోల స్థానంలో జీపీవోల నియామకం జిల్లాకు 75మంది గ్రామపంచాయతీ ఆఫీసర్లు
సుల్తానాబాద్(పెద్దపల్లి): గ్రామస్థాయిలో రెవె న్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే వీఆర్వోల స్థానంలో గ్రామ పంచాయతీ ఆఫీసర్(జీపీవో)లను నియమించింది. ఈమేరకు ఈనెల 5వ తేదీన సీఎం రేవంత్‌రెడ్డి జీపీవోలకు హైదరాబాద్‌లో నియామక పత్రాలు అంద జేశారు. ఇందులో జిల్లాకు 75 మంది జీపీవోల ను కేటాయించారు. ఇందులో 71 మంది స్థాని కులు కాగా మరో నలుగురు ఇతర జిల్లాకు చెంది నవారు ఉన్నారని అధికారులు తెలిపారు. నియా మకపత్రాలు అందుకున్న వారు వెంటనే విధుల్లో చేరాల్సి ఉంటుందని వారు వివరిస్తున్నారు.
సర్దుబాటు కోసం..
జిల్లావ్యాప్తంగా గతంలో గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్వో)గా పనిచేసిన వారిని వివిధ ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేసేందుకు అర్హతలను బట్టి పరీక్ష నిర్వహించాలని సర్కారు గతంలో నిర్ణయింది. ఇందుకోసం జిల్లానుంచి 100 మంది దరఖాస్తు చేసుకున్నారు. గత మే 25, జూలై 27వ తేదీల్లో రెండు విడతలుగా అధికారు లు పరీక్షలు నిర్వహించారు. ఇందులో 71 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరికి పోస్టింగ్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో 212 రెవెన్యూ విలేజీలు ఉండగా, 135 క్లస్టర్లు ఉన్నాయి.
భూ సమస్యల పరిష్కారం లక్ష్యంగా..
జిల్లాలో రెవెన్యూ, భూ సంబంధిత సమస్యల పరిష్కారం, రికార్డుల క్లియరెన్స్, ప్రజల్లో ఘర్షణలకు తావు లేకుండా జీపీవో వ్యవస్థను తీసుకొస్తున్నారని జిల్లా అధికారులు వివరిస్తున్నారు. వీఆర్‌ఏ, వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన తర్వాత గ్రామాల్లోని సమాచారం ఉన్నతాధికారులకు చేరడంలేదు. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గ్రామ పరిపాలన కోసం జీపీవోలను నియమించేందుకు నిర్ణయించిందని అంటున్నారు.
ప్రజలకు మెరుగైన సేవల కోసం..
జీపీవోల నియామకంతో గ్రామీణులకు రెవెన్యూ సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. ప్రధానంగా జనన, మరణాలు, ప్రమాదాలు, ఆత్మహత్యలు, సంక్షేమ పథకాలు, ఇతరత్రా కార్యకలాపాల సమాచారం, సర్వేలు, విచారణ నివేదికలను గ్రామ పంచాయతీ అధికా రి ద్వారా ఉన్నతాధికారులకు చేరుతాయని అంటున్నారు. కులం, ఆదాయం, నివాసం తదితర సేవల కోసం పంచనామా చేయడం, భూ రికార్డుల భద్రత, ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువులు, నీటివనరుల గుర్తింపు, విపత్తు సమయంలో సహాయక చర్యలు అందుబాటులోకి వస్తాయని అంటున్నారు.
135 క్లస్టర్లు.. 75 మంది జీపీవోలు
జిల్లాలో 135 క్లస్టర్లు ఉన్నాయి. జిల్లాకు 75 మంది జీపీవోలను నియమించారు. ఒక్కో క్లస్టర్‌కు ఒక జీపీవోను నియమించినా ఇంకా సగం ఖాళీలు ఉంటాయి. అయితే, ఒక్కొక్కరికి ఒకటి కేటాయిస్తారా, ఇంకా ఇన్‌చార్జిలుగా అదనంగా పంచాయతీల బాధ్యతలు అప్పగిస్తారా? అనేది తెలియరావడంలేదు.