బల్దియాల్లో చెత్త సమస్య | - | Sakshi
Sakshi News home page

బల్దియాల్లో చెత్త సమస్య

Jun 20 2023 12:58 AM | Updated on Jun 20 2023 2:07 PM

- - Sakshi

సాక్షి, పెద్దపల్లి: జిల్లాలో పట్టణీకరణ అంతకంతకూ పెరిగిపోతోంది. జనాభా, ఆధునిక జీవనశైలికి తగినట్లు బల్దియాల్లో వాతావరణ పరిస్థితులను మార్చాలంటే అది వందశాతం పారిశుధ్యం నుంచే మొదలుకావాలి. పట్టణాల్లో జనాభా ఏటా పెరిగిపోతుండగా.. నిత్యం టన్నుల కొద్దీ చెత్త వెలువడుతోంది. అయితే ఆ చెత్తను డంప్‌ చేయడానికి మాత్రం రామగుండం, మంథనిలో స్థలాలు లేవు. ఫలితంగా గోదావరి ఒడ్డున, రోడ్డుపైనే పోస్తున్నారు. జిల్లాలోని బల్దియాల్లో చెత్తను నిర్ణీత విధానంలో రీసైక్లింగ్‌ చేయకపోవడంతో డంపింగ్‌యార్డుల్లో టన్నుల కొద్దీ పేరుకుపోతోంది. ప్రభుత్వం నూతన మున్సిపాలిటీ చట్టం తెచ్చినప్పటికీ.. పట్టణాల్లో నిత్యం వెలువడే చెత్తను రీసైక్లింగ్‌ చేసి పర్యావరణానికి మేలు జరిగేలా ఎరువుల తయారీ చేపట్టకపోవడంతో సమస్య రోజురోజుకూ పెరిగిపోతోంది. జిల్లావ్యాప్తంగా బల్దియాల్లో రీసైక్లింగ్‌ చర్యలు అరకొరగానే సాగుతున్నాయి.

గాడి తప్పిన తడి, పొడి చెత్త ప్రక్రియ..
నిత్యం ఇంటింటికీ తిరిగి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలి. తడిచెత్త ద్వారా ఎరువు, పొడిచెత్త ద్వారా కార్మికులు ఆదాయం పొందవచ్చు. తడి, పొడి చెత్త వేరు చేసే ప్రక్రియ రామగుండం కార్పొరేషన్‌ పరిధిలో కాగితాలకే పరిమితం అవుతోంది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ తడి, పొడిచెత్త నిర్వహణతోపాటు బహిరంగ మల, మూత్ర విసర్జన, మురుగు నిర్వహణ కూడా కీలకం. కేవలం పొడి చెత్త నిర్వహణ చేపడుతున్న అధికారులు.. తడి చెత్తపై చేతులెత్తేశారు. తడి చెత్తతో కంపోస్టు ఎరువు తయారు చేయడానికి అవసరమైన అన్ని వనరులూ ఉన్నప్పటికీ.. ఆ దిశగా అడుగులు మాత్రం ముందుకుపడటం లేదు.

తడి చెత్తతో ఎరువులను తయారు చేసి నర్సరీలకు వాడుతున్నట్లు తప్పుడు నివేదికలు తయారు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తడి చెత్త నుంచి సేంద్రియ ఎరువు తయారీ చేసేందుకు గౌతమినగర్‌, ఎన్టీఆర్‌నగర్‌, జ్యోతినగర్‌లో షెడ్ల నిర్మాణం చేపట్టినప్పటికీ, అవి వినియోగానికి నోచుకోలేదు. రెండేళ్ల క్రితం ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించారు. సేంద్రియ ఎరువు తయారీ కేంద్రాలను నిర్వహించి కొంత ఫలితం సాధించారు. తర్వాత ఈ ప్రక్రియ నిర్వహణ పూర్తిగా గాడి తప్పింది. రామగుండంతోపాటు జిల్లాలో ఉన్న పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీల్లో వాహనాల్లో ఇంటింటికి తిరిగి చెత్తను సేకరిస్తున్నారు. నేరుగా డంపింగ్‌ యార్డులకు తరలించి చేతులు దులుపుకుంటున్నారు.

రీసైక్లింగ్‌ ప్రక్రియను పట్టించుకోకపోవడంతో చెత్త గుట్టలుగా పేరుకుపోతోంది. ఆ చెత్త కుప్పలను కాల్చడంతో పొగ కాలుష్యంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయమై మున్సిపల్‌ కమిషనర్లను వివరణ కోరగా.. డంపింగ్‌ యార్డుల స్థలసేకరణకు సింగరేణికి లేఖ రాశామని చెప్పారు. తడి, పొడి చెత్త సేకరణ, సెగ్రిగేషన్‌ షెడ్ల వినియోగంపై వివరణ కోరగా.. చెత్తద్వారా ఆదాయం పొందేలా, షెడ్లను పూర్తిస్థాయిలో వినియోగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రోడ్డుపైనే పారబోత
ఈ చిత్రంలో రోడ్డుపక్కనే చెత్త డంపింగ్‌ చేసి కనిపిస్తున్నది మంథని మున్సిపాలిటీలోనిది. మంథని మున్సిపాలిటీగా రూపాంతరం చెందినప్పటికీ డంపింగ్‌యార్డు లేకపోవడంతో ప్రతిరోజూ సేకరించే సుమారు 18 టన్నుల చెత్తను మంథని–కాటారం రహదారి వెంబడి.. పట్టణ శివారులో డంప్‌ చేస్తున్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించకుండా అంతా కలిపేస్తుండడం.. అనంతరం కాల్చివేయటం పరిపాటిగా మారింది. దీంతో పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement