కొయ్యకాలు కాల్చొద్దు
● పర్యావరణానికి ముప్పు
● భూసారం దెబ్బతీయొద్దు
● వ్యవసాయాధికారుల సూచన
పెద్దపల్లిరూరల్: పంట అవశేషాలకు నిప్పు పెట్టి కాల్చితే సారవంతమైన భూముల్లోని పోషకాలు నశించి భూసారం దెబ్బతింటుంది. దిగుబడి చేతికి వచ్చాక వరికొయ్యలను కాల్చితే అనేక అనర్థాలు తలెత్తే అవకాశాలు ఉంటాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. పర్యావరణానికీ ము ప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భూసారం దెబ్బతినే ప్రమాదం
రైతులు తదుపరి సాగుకోసం భూమిని కలియదున్నేందుకు వరి కొయ్యలను కాల్చడం సులువని భావిస్తున్నారు. చాలామంది వాటిని కాల్చేందుకే యత్నిస్తున్నారు. దీనిద్వారా నేలలోని అనేక రకాల సూక్ష్మక్రిములు, వానపాముల లాంటి జీవులు అగ్ని కి ఆహుతి కావడంతో భూసారం దెబ్బతినే ప్రమా దం ఉందని వ్యవసాయశాఖ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. పంటలకు భూమిలోని పోషకాలు, జీవరాశులు మేలు చేసే అవకాశం లేకుండా పోతుందని అంటున్నారు. తిరిగి భూసారం యథాస్థితికి చేరాలంటే దీర్ఘకాలం పడుతుందని పేర్కొంటున్నారు.
దిగుబడిపై ప్రభావం
వరికొయ్యలు కాల్చితే భూసారం దెబ్బతిని దిగుబడి గణనీయంగా తగ్గే ప్రమాదముంటుంది. రైతు లు భూసారంపై అవగాహన కలిగి ఉండి లోపాలున్న వాటిని పెంచేందుకు అవసరమైన మందులు వినియోగించి దిగుబడి పెంచుకునేలా ముందుకు సాగాలని, వరి కొయ్యలను కాల్చి నష్టపోవద్దని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.


