భారమైన ఇంటి నిర్మాణం
పెరిగిన స్టీల్, సిమెంట్ ధరలు అకాశానికి నిర్మాణ సామాగ్రి సర్కారు ఇచ్చేది రూ.5లక్షలు అదనంగా రూ.4లక్షలు వెచ్చిస్తేనే ఇల్లు పూర్తి లబోదిబోమంటున్న ‘ఇందిరమ్మ’ లబ్ధిదారులు
రామగిరి(మంథని): పెరిగిన స్టీల్, సిమెంట్, ఇసుక, కంకర ధరలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణదారులపై ఆర్థికభారం పడుతోంది. పనులు గాడిన పడుతున్న సమయంలోనే నిర్మాణ సామగ్రి ధరలు అధికం కావడం ఇళ్ల ప్రగతికి ప్రతిబంధకంగా మారుతోంది. వీటికితోడు కూలి ధరలు కూడా విపరీతంగా పెరిగి పేదలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పెరిగిన ధరలను బట్టి ఒక్కో ఇంటిపై రూ.3 లక్షల నుంచి రూ.4లక్షల వరకు అదనపు భారం పడుతోందని మేసీ్త్రలు వివరిస్తున్నారు. నిన్నామొన్నటి వరకు అంతంతమాత్రంగా ఉన్న ధరలు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుతో అమాంతంగా పెరిగాయని అంటున్నారు. ప్రభుత్వం అందించే రూ.ఐదు లక్షలకుతోడు మరో రూ.ఐదు లక్షల వరకు ఒక్కో ఇంటికి అదనంగా వెచ్చించాల్సి వ స్తోంది. దీనికితోడు కఠిన నిబంధనలు లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
మండుతున్న సిమెంట్ ధరలు..
ఒక్కో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 500 నుంచి 550 వరకు సిమెంట్ బస్తాలు అవసరమవుతాయని మేసీ్త్రలు చెబుతున్నారు. నెల క్రితం ఒకసిమెంట్ బ స్తా ధర రూ.270 వరకు ఉండగా.. ప్రస్తుతం గ్రేడ్‌ను బట్టి సుమారు రూ.50 నుంచి రూ.100 వరకు ధరతో విక్రయిస్తున్నారు. పాత ధర ప్రకారం సిమెంట్ ఖర్చు రూ.1.50లక్షల వరకు వచ్చేది. పెరిగిన ధరలతో ఒక్కో లబ్ధిదారుపై రూ.35వేల వరకు అదనంగా భారం పడుతోంది. దీంతో కొందరు పనులు ప్రారంభించేందుకు భయపడుతున్నారు.
రూ.4వేలకు చేరిన ట్రాక్టర్ ఇసుక..
ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితంగా సరఫరా చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. కానీ, ట్రాక్టర్ యాజమానులు నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. ట్రిప్పు ఇసుకకు రూ.3,500 నుంచి రూ.4వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముందు ట్రాక్టర్ ఇసుక ట్రిప్పును ఏరియాను బట్టి రూ.2వేల వరకు సరఫరా చేసేవారు. ఇందిరమ్మ ఇళ్ల పనులు జోరందుకోవడంతో వ్యాపారులు రెచ్చిపోతున్నారు. బహిరంగ మార్కెట్‌లో ఇసుక విక్రయించరాదని ప్రభు త్వం నిబంధనలు విధించినా.. చాలామంది రహస్యంగా విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు.
స్టీల్ ధరలకు రెక్కలు..
స్టీల్ ధర కంపెనీని బట్టి గతంలో క్వింటాల్‌కు కనిష్టంగా రూ.5,500 ఉండగా, ఇప్పుడు గరిష్టంగా రూ.7,800కు చేరింది. ఇంటి నిర్మాణానికి కనీసం 1.50 టన్నుల స్టీల్ అవసరమని లబ్ధిదారులు చెబుతున్నారు. రూ.5,500 చొప్పున రూ.82,500అవుతుండగా.. సగటున క్వింటాల్‌కు రూ.7,500 చొప్పున లెక్కిస్తే రూ.1,12,500 ఖర్చు అవుతోంది. ఈ లెక్కన రూ.30వేలు వరకు అదనంగా భారం పడుతోందని లబ్ధిదారులు వాపోతున్నారు.
కంకర ధరలు సైతం..
ఇందిరమ్మ ఇంటి బెస్‌మెంట్ నిర్మాణానికి రాయి తప్పనిసరి. గతంలో ట్రాక్టర్ రాయి, దొడ్డు కంకర రూ.2,000 ఉండగా, ప్రస్తుతం రూ.4 వేల నుంచి రూ.5వేల వరకు పలుకుతోంది. ఇక స్లాబ్‌లో ప్రత్యేకంగా సన్నరకం కంకర వాడాల్సి ఉంటుంది. దాని ధరలు కూడా క్రషర్ యాజమానుల అమాంతం పెంచేశారు. బెస్‌మెంట్ నేల భాగంలో వేసే దొడ్డు కంకరకు కూడా ధరలు విపరీతంగా పెంచడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ధరలు రెట్టింపవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల సమాచారం
మంజూరైనవి 9,438
ముగ్గు పోసినవి 4,727
బేస్‌మెంట్ లెవల్ 1,749
గోడల వరకు 672
స్లాబ్ వరకు 800
నిర్మాణం పూర్తి 257
పనులు ప్రారంభం కానివి 1,016
భారమైన ఇంటి నిర్మాణం


