ముచ్చటగా మూడోసారి ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

ముచ్చటగా మూడోసారి ఎన్నికలు

Oct 5 2026 12:39 AM | Updated on Oct 5 2026 12:39 AM

పాలకొండ రూరల్‌: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో అందరి చూపు రిజర్వేషన్లపైనే ఉంది. అటు రాజకీయ వర్గాలతోపాటు ఇటు నగరపంచాయతీకి చెందిన ప్రజల్లో కూడా ఉత్కంఠ మొదలైంది. దీంతో ఎవరికి వారు తమ అభ్యర్థిత్వం నిలుపుకునేందుకు ఔత్సాహికులు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు.

మేజర్‌ పంచాయతీగా ఉన్న పాలకొండ పట్టణం 2013 మార్చిలో నగర పంచాయతీగా రూపాంతరం చెందింది. పట్టణంలో వందకుపైబడి ఉన్న వీధులను 20 వార్డులుగా నిర్దేశించారు. ఏడాది కాలం ప్రత్యేకాధికారుల పాలన కొనసాగింది. మొదటిసారి 2014 జరిగిన ఎన్నికల్లో టీడీపీ 12, వైఎస్సార్‌సీపీ 3, స్వతంత్రులు 5 స్థానాల్లో పట్టు సాధించించారు. జనరల్‌ మహిళా రిజర్వేషన్‌ కావడంతో టీడీపీ నుంచి పల్లా విజయనిర్మల తొలిసారి అధ్యక్ష స్థానం దక్కించుకున్నారు. అటుపై కోవిడ్‌ కారణంగా నిలిచిన ఎన్నికలు 2021లో రెండవసారి నిర్వహించారు. నాటి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఽభ్యర్థులు 17 స్థానాల్లో విజయ సాధించారు. ఎస్సీ మహిళ రిజర్వేషన్‌ ప్రాప్తికి వైఎస్సార్‌సీపీ నుంచి యందవ రాధాకుమారిని అధ్యక్ష పీఠం వరించింది. తాజాగా మూడవ దఫా ఎన్నికలకు పాలకొండ నగరపంచాయతీ సిద్ధమవుతోంది.

పట్టు ఎవరిదన్న చర్చ

వార్డు వారీగా, ప్రాంతాల వారీగా తమతమ సామాజిక వర్గాల నుంచి మద్దతు కూడగట్టే పనిలో ఆశావహులు నిమగ్నమయ్యారు. ఎక్కడ చూసినా, ఎవరిని కదిపినా ఈ దఫా పాలకొండ నగరపంచాయతీపై పట్టు సాధించేది ఎవరన్న చర్చ ఊపందుకుంది. స్థానిక ఎన్నికలకు రేపోమాపో నోటిఫికేషన్‌ వెలువడుతందన్న క్రమంలో ఎవరి స్థాయిలో వారు వారు మద్దతు ఇవ్వదలచిన పార్టీలకు సంబంఽధించి రాజకీయ విశ్లేషకుల్లా వారి వాదన గట్టిగానే వినిపిస్తుండడం విశేషం.

చకచక యంత్రాంగం అడుగులు..

తాజా ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు అధికార యంత్రాంగం చకచక అడుగులు వేస్తోంది. గత ఎన్నికల్లో 20 వార్డుల్లో 21,821 మంది ఓటర్లు ఉండగా 2026 సమగ్ర ఓటర్ల సవరణ ప్రక్రియ(సర్‌) పూర్తి నాటికి ఓటర్ల సంఖ్య 23,466కు చేరింది. వారిలో పురుషులు 11.453మంది, మహిళలు 12,012మంది, ఇతరులు ఒకరు ఉన్నారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఓటర్ల సంఖ్య 1,645, వార్డుల సంఖ్య సంఖ్య 20 నుంచి 28కి పెరిగింది. అభ్యంతరాలు పరిష్కరించిన అధికారులు పెరిగిన వార్డులకు తగ్గట్లు పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు. బ్యాలెట్‌ బ్యాక్స్‌లు, ఎన్నికల నిర్వహణ స్టేషనరీ కూడా సమకూర్చుకున్నారు.

కూటమి వర్గాల్లో ఆశావహులే అధికం.

గతంలో జరిగిన నగర ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు పోటీపడ్డారు. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలకు సంబంధించి కూటమి వర్గాల్లో ఆశావహుల సంఖ్య అధికంగా ఉందన్న చర్చ జరుగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన ఔత్సాహికులు ఒక్కో వార్డు నుంచి పార్టీకి ఇద్దరు ముగ్గురు తమ పేర్లు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో రిజర్వేషన్‌ అనుకూలిస్తే తమ తమ పార్టీ నుంచి బీఫారం పొందాలని ఎత్తుకుపై ఎత్తులు వేస్తున్నారు. అధికార పార్టీకి సంబంధించి పట్టున్న నాయకులను, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు. వారిని గాడిలో పెట్టడం అధికార పార్టీ నాయకులకు తలనొప్పిగా మారిందని కూటమి వర్గాలే చర్చిస్తున్నాయి. కూటమి నుంచి అవకాశం దక్కకుంటే స్వతంత్రులుగా బరిలో గిదాలని ఆశావహులు భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏక నాయకత్వంలో ముందుకు వెళ్లాలని తలపెట్టింది. ఇందుకు తగ్గట్లు వార్డుల వారీగా మాజీ కౌన్సిలర్లతో సమాలోచనలు చేస్తూ బలమైన అభ్యర్థులను బరిలోకి దించేలా సమష్టి కసరత్తులో నిమగ్నమైంది. సీపీఐ, సీపీఎంలు తమ రాష్ట్ర అధిష్టాన వర్గాల సూచనలతో బరిలో దిగుతామని స్పష్టం చేస్తున్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఓటరు మహాశయుని తీర్పు ఎలా ఉంటుందో వేచిచూడాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement