● నడిపల్లి మహిళ హత్యకేసు ఛేదించిన పోలీస్‌శాఖ
● నిందితుడి అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు
● వివరాలు వెల్లడించిన ఎస్పీ ఏఆర్ దామోదర్
విజయనగరం టౌన్: వివాహేతర సంబంధాలతో కుటుంబాలు ఛిన్నాభిన్నమై, అంతులేని విషాదం మిగులుతుందని వాటి జోలికి పోవద్దని ఎస్పీ ఏఆర్.దామోదర్ హెచ్చరించారు. జీవితాలను నాశనం చేసే వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండాలని, మాయ మాటలతో ప్రలోభాలకు గురిచేస్తే, వాటిని తిప్పికొట్టాలని సూచించారు. కుటుంబ వ్యవస్ధతో పాటు చిన్నారులు దిక్కూముక్కూ లేనివారవుతారని, ప్రతి ఒక్కరూ గమనించాలని విజ్ఞప్తి చేశారు. పూసపాటిరేగ మండలంలోని నడిపల్లి గ్రామంలో జరిగిన హత్య ఉదంతంపై ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.
అనుమానం..పెనుభూతమై..
పూసపాటిరేగ మండలంలోని నడిపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న శీల అప్పారావు..తన భార్య రమ (37) కనిపించడం లేదని పూసపాటిరేగ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఉమెన్ మిస్సింగ్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం రమ మృతదేహం లభించడంతో మిస్సింగ్ కేసు కాస్త హత్యకేసుగా మార్చి ఉమెన్ పీఎస్ డీఎస్పీ పీవీవీ నరసింహరావు, ఇన్‌చార్జ్ డీఎస్పీ ఎస్.రాఘవులు ఆధ్వర్యంలో భోగాపురం రూరల్ సీఐ ఎన్.శ్రీనివాసరావు దర్యాప్తు వేగవంతం చేశారు. హత్యకు గురైన రమకు హత్యకు పాల్పడిన నిందితుడు 28 ఏళ్ల లంకలపల్లి బంగారుబాబు మధ్య నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. గత నాలుగు నెలలుగా రమ తన ప్రియుడు బంగారుబాబును దూరం పెట్టడం, బంగారుబాబు ఫోన్‌కాల్స్‌కు సరిగ్గా స్పందించకపోవడంతో ఆమె వేరెవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానం పెంచుకుని, ఆమైపె కక్ష పెంచుకున్నాడు. నిందితుడు ఈ నెల 14న 11 గంటల ప్రాంతంలో రమకు ఫోన్ చేయగా ఆమె కొద్ది సమయం మాత్రమే ఫోన్ మాట్లాడి పెట్టేసింది. అనంతరం మధ్యాహ్న సమయంలో మరోసారి ప్రియుడు ఫోన్ చేయడంతో ఇంట్లో ఎవరూ లేరని, తనతో వివాహేతర సంబంధం కొనసాగించాలని, మాట్లాడుకుందామని ఇంటికి రమ్మని చెప్పడంతో, ప్రియుడి మాటలు నమ్మి రమ వారింటికి వెళ్లింది. వివాహేతర సంబంధాన్ని తనతో కొనసాగించకపోతే విషయాన్ని భర్తకు చెప్పేస్తామని ఆమెను బెదిరించడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన బంగారుబాబు ఆమె ముక్కు, నోరుపై దిండును పెట్టి, ఊపిరి ఆడకుండా చేసి హత్యచేశాడు. అనంతరం గోనె సంచిలో ఆమె శవాన్ని దాచిపెట్టి, మోటారు సైకిల్ ముందు పెట్టుకుని, సారిపల్లి కొండ సమీపంలోకి తీసుకుని వెళ్లి పడేశాడు.
దర్యాప్తులో భాగంగా లంకలపల్లి బంగారుబాబుపై అనుమానంతో దర్యాప్తు అధికారులు సాంకేతికను వినియోగించి ఆధారాలు సేకరించి, నిందితుడిని అదుపులోకి తీసుకుని, విచారణ చేయగా, నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. నేరస్థలాన్ని క్షుణ్ణంగా క్లూస్ టీమ్ సహకారంతో పరిశీలించి, సాంకేతిక, శాసీ్త్రయ ఆధారాలు సేకరించామని ఎస్పీ వివరించారు. రమ మృతదేహాన్ని తరలించేందుకు ఉపయోగించిన మోటార్ సైకిల్, నిందితుడు వినియోగిస్తున్న మొబైల్ ఫోన్ ఫోరెన్సిక్ నిపుణుల సహకారంతో సీజ్ చేశామన్నారు. కేసులో దర్యాప్తును వేగవంతంగా పూర్తిచేసి, న్యాయస్ధానంలో నిందితుడిపై త్వరలో అభియోగపత్రం దాఖలు చేసి, నిందితుడ్ని శిక్షించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. కేసులో క్రియాశీలకంగా పనిచేసిన భోగాపురం రూరల్ సీఐ ఎన్.శ్రీనివాసరావు, పూసపాటిరేగ ఎస్సై అరుణ్ కిరణ్, కానిస్టేబుల్స్ సతీష్, వాసులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో డీఎస్పీలు ఎస్.రాఘవులు, పీవీవీ.నరసింహారావు, భోగాపురం రూరల్ సీఐ ఎన్.శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఏవీ .లీలారావు, పూసపాటిరేగ ఎస్సై అరుణ్‌కిరణ్, నెల్లిమర్ల ఎస్సై గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.


