బొబ్బిలి: పట్ట ణానికి చెందిన కె.అదృష్ట కుమార్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ రాష్ట్ర డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. ఇటీవలే నియామక సమాచారం అందుకున్న అదృష్ట కుమార్ బుధవారం కాకినాడలోని జేఎన్‌టీయూ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు టి. ప్రసన్నకుమార్ చేతులమీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. రాష్ట్ర డైరెక్టర్‌గా నియామకమైన అదృష్టకుమార్‌ను ఈ సందర్భంగా పట్టణ వాసులు అభినందిస్తున్నారు.
సమర్ధవంతమైన చర్యలతో నేరాల తగ్గుముఖం
విజయనగరం టౌన్: జిల్లా పోలీసుశాఖ చేపడుతున్న పటిష్టమైన భద్రత చర్యలు, సమర్థవంతమైన పోలీసింగ్‌తో గతేడాది కంటే ఈ ఏడాది నేరాలు తగ్గుముఖం పట్టాయని ఎస్పీ ఏఆర్.దామోదర్ పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం వివరాలు వెల్లడించారు. క్రైమ్ ఎగినెస్ట్ ఉమెన్‌కి సంబంధించి గతేడాది 304 కేసులు నమోదుకాగా, ఈ ఏడాదిలో 217 కేసులు మాత్రమే నమోదయ్యాయన్నారు. క్రైమ్ ఎగినెస్ట్ చిల్డ్రన్‌కి సంబంధించి పోక్సో కేసులు గత ఏడాది 44 నమోదు కాగా, ఈ ఏడాదిలో 20 కేసులు నమోదయ్యాయన్నారు. క్రైమ్ ఎ గినెస్ట్ ఉమెన్ కేసుల్లో 31 క్రైమ్, ఎగినెస్ట్ చిల్డ్రన్ కేసుల్లో 36, మొత్తం 67 కేసుల్లో నిందితులకు న్యాయస్ధానాల్లో శిక్షలు పడ్డాయని తెలిపారు. గంజాయి కేసుల్లో గతేడాది 78 కేసులు నమోదు చేసి 1147.856 కిలోల గంజాయిని సీజ్ చేసి, 246 మందిని అరెస్టు చేసి, 35 వాహనాలను సీజ్ చేశామన్నారు. ఈ ఏడాదిలో 23 కేసులు మాత్రమే నమోదుకావడం, 655.225 కిలోల గంజాయి సీజ్ చేసి, 118 మందిని అరెస్ట్ చేసి, 25 వాహనాలు సీజ్ చేశామని తెలిపారు. రహదారి ప్రమాదాల్లో ఈ ఏడాది ఇప్పటివరకూ 350 రహదారి ప్రమాదాలు జరిగి, 137 మంది మరణించగా, 444 మంది గాయపడ్డారన్నారు. గతేడాది కంటే రహదారి ప్రమాదాలు 15.5శాతం తగ్గాయని వివరించారు.
రెవెన్యూ రికార్డుల మార్పుపై ఫిర్యాదు
పూసపాటిరేగ: మండలంలోని కొల్లాయివలసకు సంబంధించిన రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేశారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ మేరకు తహసీల్దార్ ఎన్‌వీ రమణను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. సర్వే నంబర్ 76–1లో భూములు మార్పు చేశారని దువ్వు అప్పలస్వామితో పాటు పలువురు తెలిపారు. దీనిపై తహసీల్దార్ రమణ స్పందిస్తూ విచారణ చేసి హక్కుదారుల పేర్లు నమోదు చేస్తామన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ఎంవీజీ శంకరరావు, నర్సన్న, తదితరులు పాల్గొన్నారు.
లారీ ఢీకొని వ్యక్తి మృతి
● గరివిడి ఆర్‌ఓబీ సమీపంలో ప్రమాదం
చీపురుపల్లిరూరల్(గరివిడి): విజయనగరం–పాలకొండ ప్రదాన రహదారిలో గరివిడి ఆర్‌ఓబీ సమీపంలో పెట్రోల్‌బంకు ఎదురుగా బుధవారం ఉదయం ఓ బైక్‌ను లారీ ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుర్ల మండలానికి చెందిన ద్విచక్రవాహనదారు బోడసింగి లక్ష్మణరావు(37) సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. ఈ ప్రమాదానికి సంబంధించి గరివిడి ఎస్సై బి.లోకేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు ఉదయం 11గంటల సమయంలో విజయనగరం నుంచి చీపురుపల్లి వైపు వెళ్తున్న లారీడ్రైవర్ మితిమీరిన వేగంతో వాహనాన్ని నడుపుతూ ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గుర్ల మండలంలోని కొండగండ్రేడు గ్రామానికి చెందిన బోడసింగి లక్ష్మణరావు తీవ్రంగా గాయపడి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. మృతుడి భార్య ఈశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మృతుడికి భార్యతో పాటు డిగ్రీ చదువుతున్న కూతురు నీలిమ, ఏడో తరగతి చదువుతున్న బాలుడు యుగంధర్ ఉన్నారు. చిన్నపాటి వ్యవసాయం, కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉన్న ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది.


