● ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ నరసయ్య
విజయనగరం: ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ నరసయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ సమీపంలో రెవెన్యూ భవన్‌లో ఉమ్మడి విజయనగరం జిల్లా ఎంప్లాయీస్ యూనియన్ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సీ్త్రశక్తి పథకం మరింత విజయవంతం కావాలంటే భవిష్యత్‌లో రాబోయే ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీనే కొని నిర్వహించడం ద్వారా సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ నరసయ్య తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రతకు సంబంధించి ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో యాజమాన్యంతో చర్చలు జరిపి, ఉద్యోగులకు భద్రతతో పాటు భరోసా కల్పించేలా పలు అంశాలపై ఒప్పందాలు సాధించామని తెలిపారు. ఆర్టీసీలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి ఉద్యోగ భద్రత, సంక్షేమం, పదోన్నతులు, ఖాళీల భర్తీ, కొత్త బస్సుల కొనుగోలు, విద్యుత్ బస్సుల విషయంలో ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణ వంటి అంశాలపై ఎంప్లాయీస్ యూనియన్ స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. ఈ సమావేశంలో ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ పి.భానుమూర్తి మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జేఏసీ చేసిన పోరాటాల ఫలితంగానే పలు అంశాలపై యాజమాన్యం సానుకూలంగా స్పందించిందన్నారు. ఈ సమావేశంలో ఈయూ రాష్ట్ర కార్యదర్శి డి.అరుణ మాట్లాడుతూ ఐక్యంగా ఉంటేనే హక్కుల సాధన సాధ్యమవుతుందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులంతా ఐక్యంగా ఉండాలని, యూనియన్లకు అతీతంగా ఉద్యోగుల ప్రయోజనాల కోసం, ఆర్టీసీ పరిరక్షణ కోసం యూనియన్ చేస్తున్న కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. సమావేశంలో కె.కృష్ణారావు, ఎల్‌ఏరావు, కేవీ రమణ, యుఎస్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.


