● రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో జిల్లా పోలీసుల ప్రతిభ
విజయనగరం టౌన్: రాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన రాష్ట్రస్ధాయి పోలీస్ స్పోర్ట్స్, గేమ్స్ మీట్, డ్యూటీమీట్‌లో విశాఖ రేంజ్ తరఫున జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని పతకాలు సాధించారు. ఈ మేరకు ఎస్పీ ఏఆర్.దామోదర్ బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పతకాలు సాధించిన పోలీసులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్టర్‌లో రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్, గేమ్స్ మీట్, డ్యూటీమీట్‌లను ఇటీవల నిర్వహించారన్నారు. ఈ పోటీల్లో జిల్లా పోలీసుశాఖలో పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని, విశేష ప్రతిభ కనబర్చారన్నారు. జిల్లా పోలీసు శాఖకు చెందిన 34 మంది పోలీసు అధికారులు, సిబ్బంది వివిధ క్రీడా పోటీల్లో విశాఖ రేంజ్ తరఫున పాల్గొని 35 గోల్డ్ మెడల్స్, 18 సిల్వర్, 13 బ్రాంజ్ మెడల్స్‌తో సహా 66 పతకాలను సాధించి, రాష్ట్రస్ధాయిలో విశాఖ రేంజ్ ఆల్ రౌండర్ చాంపియన్ షిప్ సాధించడంలో క్రియాశీలక పాత్ర పోషించారన్నారు. అదేవిధంగా పోలీసుల వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శించడంలో కూడా జిల్లా పోలీసుశాఖకు చెందిన 8 మంది 4 గోల్డ్ మెడల్స్ , 3 సిల్వర్ మెడల్స్ ఒక బ్రాంజ్ మెడల్ సహా 8 మెడల్స్‌ను రాష్ట్రస్ధాయిలో సాధించారని చెప్పారు. మెడల్స్ సాధించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించి, వారి క్రీడాప్రతిభను, వృత్తి నైపుణ్యాన్ని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ పి.కిరణ్‌కుమార్, ఏఆర్ డీఎస్పీ ఈ.కోటిరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఏవీ. లీలారావు, భోగాపురం రూరల్ సీఐ ఎన్.శ్రీనివాసరావు, ఆర్‌ఐ ఎన్.గోపాలనాయుడు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.


