ప్రజాసేవకు కాదు | - | Sakshi
Sakshi News home page

ప్రజాసేవకు కాదు

Sep 16 2026 4:01 AM | Updated on Sep 16 2026 4:01 AM

ప్రజాసేవకు కాదు పదవికి వీడ్కోలు..

నేటితో మండల పరిషత్‌

సమావేశాలకు తెర

రెండున్నరేళ్లలో ఏమీలేదు

చివరి మండల సమావేశంలో ఎంపీపీ బి.ప్రమీల భావోద్వేగ ప్రసంగం

పాచిపెంట: ఐదేళ్ల పదవీకాలంలో ప్రజలతో మమేకమై పనిచేసిన అనుభవాలు.. అభివద్ధి పనుల్లో ఎదురైన సవాళ్లు.. ప్రజా సమస్యల పరిష్కారానికి చేసిన ప్రయత్నాలు.. ఇవన్నీ ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి. మండల పరిషత్‌ పాలకవర్గానికి చివరి సర్వసభ్య సమావేశం కావడంతో పాచిపెంట మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఎంపీపీ బి. ప్రమీల అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో శాఖల వారీగా అధికారులు ప్రగతి నివేదికలను సభ్యులకు వివరించారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ..ప్రజా సమస్యలు, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. రాజకీయ పార్టీలు ప్రతి ఐదేళ్లకోసారి మారుతుంటాయని, అయితే అధికారులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలందించాల్సిన బాధ్యత కలిగి ఉంటారని పేర్కొన్నారు. పదవులు శాశ్వతం కాదు.. ప్రజలకు చేసిన సేవలే మిగులుతాయన్న భావనతో ప్రజాప్రతినిధులు పనిచేయాలని ఆమె సూచించారు. తన పదవీకాలంలో మండలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి చేసిన కృషి, అధికారులతో కలిసి పనిచేసిన అనుభవాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా తమకు ఎంపీపీ, ఎంపీటీసీ పదవులు కల్పించి ప్రజాసేవకు అవకాశం కల్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనన్‌్‌ రెడ్డి మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర లకు ప్రమీల కతజ్ఞతలు తెలిపారు. ఐదేళ్ల పదవీకాలానికి ముగింపు పలుకుతున్న సందర్భంగా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి ఎంపీపీ బి. ప్రమీలతో పాటు ఎంపీటీసీ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఐదేళ్ల పాటు కలిసి పనిచేసిన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ పలువురు భావోద్వేగానికి గురయ్యారు. పదవీకాలం ముగిసినా ప్రజలతో తమ అనుబంధం కొనసాగుతుందని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.

బలిజిపేట: మండల పరిషత్‌ సమావేశాలకు బుధవారంతో తెరపడనుంది. ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం ఈనెల 23తో ముగియనుంది. బలిజిపేటలో చివరి మండల సర్వసభ్య సమావేశాన్ని బుధవారం నిర్వహిస్తారు. మండలంలో 17ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. గలావల్లిలో సర్పంచ్‌, ఎంపీటీసీలుగా మామిడి చంద్రచూడామణి విజయం సాధించడంతో ఎంపీటీసీ పదవికి రాజీనామా చేశారు. దీంతో 17స్థానాలకు గాను 16మంది ఎంపీటీసీలే ఉన్నారు. వారిలో ఇటీవల పెద్దింపేట ఎంపీటీసీ ఎం.సాంబమూర్తి మృతిచెందారు. దీంతో మండల పరిషత్‌ సభ్యులు 15మంది, కో ఆప్షన్‌ సభ్యుడు ఒకరు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న బాడీ 2021వ సంవత్సరం సెప్టెంబరు 24న ఏర్పాటైంది.

ఇప్పటివరకు 25సమావేశాలు

అప్పట్లో కొత్తగా ఏర్పాటైన సభ్యులతో డిసెంబర్‌ 10, 2021న మొదటి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు మండల పరిషత్‌ బడ్జెట్‌సమావేశాలు 25 నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 15సమావేశాలు నిర్వహించగా, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత 10 సమావేశాలు నిర్వహించారు. నేడు చివరి సమావేశం నిర్వహించనున్నారు.

ఇంకా అందని గౌరవ వేతనం

సభ్యులకు నెలకు రూ.3వేలు గౌరవ వేతనం కింద ఇస్తారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత ఇంకా 8నెలల గౌరవ వేతనం సభ్యులకు అందాల్సి ఉంది. ఒక్కో సభ్యుడికి రూ.24వేల వంతున అందాలి. పదవీకాలం పూర్తవుతున్నా గౌరవ వేతనం ఇంకా పూర్తికాలేదనే చలోక్తులు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత సభ్యులకు గౌరవం లేదు, గౌరవ వేతనం సక్రమంగా అందలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ రెండున్నర ఏళ్లలో

సమస్యలు పరిష్కారం కాలేదు:

చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత మండల సర్వసభ్య సమావేశాల్లో సభ్యులు ప్రస్తావించిన సమస్యలు పరిష్కారం కాలేదని, సమావేశాల్లో అధికారులకు సమస్యలు తెలియచేయడం, ఆ తరువాత వాటిపై నిలదీయడమే తప్ప ఎటువంటి సమస్య పరిష్కారం కాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మండల సర్వసభ్యసమావేశానికి హాజరవడం, రిజిస్టరులో సంతకం చేయడం, సమావేశంలో కార్యాలయం వారు ఇచ్చే స్నాక్స్‌ తినడం, టీ తాగి వెళ్లిపోవడమే తప్ప ఒరిగేదేమీ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన పడకేసిందని, క్షేత్రస్థాయిలో ఉండే కార్యదర్శులు ఏమాత్రం గ్రామాలను పట్టించుకోవడం లేదని, ప్రజల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా ఉన్నాయి తప్ప వాటిపై చర్యలు లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి.

చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత ఎంపీటీసీ సభ్యుల పరంగా ఎటువంటి అభివృద్ధి పనులు నిర్వహించలేదు. అంతా డమ్మీగానే ఉంది. అధికారుల వ్యవహారశైలి మారిందని చెప్పవచ్చు. ఎంపీటీసీల గౌరవ వేతనం చెల్లించాలి. గ్రామాల్లో పేరుకుపోతున్న సమస్యలను పరిష్కరించాలి. వి.సాయిరాం,

మండల ఉపాధ్యక్షుడు, బలిజిపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement