అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు

Sep 16 2026 4:01 AM | Updated on Sep 16 2026 4:01 AM

17వ తేదీలోగా అందజేయాలి

ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం.కృష్ణ

విజయనగరం అర్బన్‌: విజయనగరం టౌన్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఖాళీగా ఉన్న మెకానికల్‌ ఇంజినీరింగ్‌ (ఎంఈఏటీ) విభాగంలో అతిథి అధ్యాపక పోస్టు భర్తీకి అర్హులైన అఽభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం.కృష్ణ తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా కళాశాల కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. మెకానికల్‌ బ్రాంచ్‌లో బీటెక్‌ లేదా సమానమైన డిగ్రీలో ద్వితీయ శ్రేణితో కనీసం 50 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ఈ నెల 18వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, విజ యనగరం టౌన్‌లో నిర్వహించే డెమో తరగతులకు విధిగా హాజరు కావాలని తెలియజేశారు.

మొక్కజొన్న పంట ధ్వంసం

పార్వతీపురం రూరల్‌: మండలంలోని రావికోన పంచాయతీ గంగమాంబాపురంలో ఏనుగులు పంటలను, ఇళ్లను మంగళవారం ధ్వంసం చేశాయి. ప్రతికూల వాతావరణం వల్ల ఈ ఏడాది వరి వేయలేక, తనకున్న 1.50 సెంట్ల భూమిలో ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న సాగుచేసిన కేండ్రుక శ్రీనివాసరావు ఆశలపై ఏనుగుల దాడి నీళ్లు చల్లింది. ఆరుగాలం కష్టించి పెంచిన పంటను సుడిగాలిలా వచ్చి సర్వనాశనం చేయడంతో ఆ రైతు కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఇదే గ్రామానికి చెందిన ఉర్లక రఘు ఇంటిపైనా గజరాజులు ప్రతాపం చూపాయి. ఇంటి గేటుతో పాటు కిటికీలను నుజ్జునుజ్జు చేయడంతో ఆ కుటుంబం భయంతో ఆవేదన వ్యక్తం చేస్తోంది. అటవీశాఖ అధికారులు తక్షణమే నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించాలని మాజీ సర్పంచ్‌ కడ్రక రామస్వామి అధికారులను కోరారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

దత్తిరాజేరు: మండలంలోని మరడాం వద్ద జాతీయ రహదారి దాటుతుండగా శుక్రవారం ఉదయం వెనుక నుంచి బైక్‌ ఢీకొన్న సంఘటనలో గాయపడిన మరడాం గ్రామానికి చెందిన గుగ్గిలపు నారాయణరావు(60) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు, ఈ మేరకు ఎస్‌.బూర్జవలస ఎస్సై ప్రయోగమూర్తి తెలిపారు. నారాయణ రావు ఇంటి నుంచి రోడ్డుకు వెళ్తుండగా బైక్‌ ఢీకొనడంతో తలకు బలమైన గాయాలు కాగా విజయనగరంలోని మహారాజా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు చెప్పారు. మృతుడికి భార్య రమణమ్మ వివాహమైన కుమార్తె ఉన్నారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.

ప్రొఫెసర్లపై ఫిర్యాదు

విజయనగరం టౌన్‌: జేఎన్‌టీయులో ఇటీవల జరిగిన పరీక్షల జవాబు పత్రాల్లో మార్కుల టాంపరింగ్‌ జరిగినట్లు వీసీ దృష్టికి వెళ్లడంతో ఆయన విచారణ కమిటీని ఏర్పాటుచేశారు. దీనిపై రిజిస్ట్రార్‌ కె.చంద్రభూషణరావు వీసీ ఆదేశాలకు మేరకు మంగళవారం రూరల్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. కొందరు ప్రొఫెసర్లపైన, ఉద్యోగులపైన ఆరోపణలు చేశారని రూరల్‌ పోలీసులు తెలిపారు.

యువకుడి దుర్మరణం

విశాఖపట్నం: జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. విశాఖపట్నంలోని ఆరిలోవ లా అండ్‌ ఆర్డర్‌ ఎస్సై వరహాలునాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం గొల్లలపాలెం గ్రామానికి చెందిన పిసిని పవన్‌శేఖర్‌(20) విశాఖలోని డాల్ఫిన్‌ హోటల్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం మధురవాడలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి భోజనం చేసి, తన స్నేహితుడు ఆకుల ప్రసాద్‌తో కలిసి బైక్‌పై జగదాంబ వైపు బయలుదేరాడు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై ఎండాడ కూడలి దాటిన తర్వాత వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో పవన్‌ శేఖర్‌ కిందపడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే ఆటోలో ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా, మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న ఎస్సై వరహాలు నాయుడు సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement