నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ సమేత వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువజామున ప్రాతఃకాలార్చన పూజలనంతరం యాగశాలలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాలను జరిపించారు. అనంతరం గ్రామ బలిహరణ పూర్తిచేసి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ధ్వజస్తంభంపై గరుత్మంతుడి చిత్రపటాన్ని ఎగురవేసి సమస్త దేవతామూర్తులను బ్రహ్మోత్సవాల వేడుకకు ఆహ్వానం పలికారు. ధ్వజారోహణంతో ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 23వ తేదీ వరకు ప్రతిరోజూ శ్రీవారిని గ్రామ తిరు వీధుల్లో ఊరేగింపు, 20న స్వామివారి కల్యాణోత్సవం, 24న పుష్పాంజలి కార్యక్రమాలు జరిపిస్తామని అర్చకులు తెలిపారు.


