● ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది తీరుపై సీఆర్‌ఎంటీల ఆగ్రహం
● విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిరసన
పార్వతీపురం రూరల్: జీతాలు చెల్లించాలని అడిగితే సర్వశిక్ష కార్యాలయ సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంపై పార్వతీపురం జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట సీపీఎం, జేఏసీల నేతృత్వంలో సీఆర్‌ఎంటీలు శుక్రవారం ఆందోళనకు దిగారు. గత నెల 20వ తేదీనే జీతాలకు సంబంధించిన బడ్జెట్ విడుదలైనప్పటికీ, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది నిర్వాకం వల్ల జీతాలు అందలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నెలవారీ ఈఎంఐలు, కుటుంబ బాధ్యతల నేపథ్యంలో సకాలంలో బిల్లులు పెట్టాలని కోరిన పాపానికి.. ‘దిక్కున్న చోట చెప్పుకోండ’ని సిబ్బంది దుర్భాషలాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన సిబ్బంది తక్షణమే క్షమాపణలు చెప్పాలని, వెంటనే వేతనాల బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. సీఆర్‌ఎంటీల నిరసనకు సీఐటీయూ జిల్లా కార్యదర్శి బీవీ రమణ సంఘీభావం తెలిపారు.


