న్యూస్‌రీల్
● పింఛను దరఖాస్తులకు అర్హతలివే.. ● సచివాలయాల్లో దగ్గరుండి పత్రాలు పరిశీలిస్తున్న ‘తమ్ముళ్లు’ ● డిజిటల్ అసిస్టెంట్ సీట్లలో కూర్చొని దరఖాస్తుల నమోదు
సాక్షి, పార్వతీపురం మన్యం:
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తోంది. ఈ కాలంలో ఇప్పటి వరకు ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చిన దాఖలాలు లేవు. తమ అర్హత పత్రాలను పట్టుకుంటూ, కాళ్లీడ్చుకుంటూ వేలాది మంది అర్హులు అధికారుల వద్దకు తిరగని రోజు లేదు. ఇప్పటి వరకు గుర్తు రాని పేదల పింఛన్లు.. అకస్మాత్తుగా, అందునా స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలయ్యే సమయానికి గుర్తొచ్చాయి. పోనీ, ఇన్నాళ్లకయినా దయ తలిచారనుకుని.. వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులు గ్రామ, వార్డు స్వర్ణ సచివాలయాలకు వెళ్తున్నారు. అక్కడ వారికి సచివాలయ సిబ్బందికి బదులు కూటమి నాయకులు.. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కనిపిస్తున్నారు. దరఖాస్తుతోపాటు.. ఎన్ని అర్హతలున్నా సరే... ‘హా, వీళ్లు మనవాళ్లు. వీరి ఓటు మనకే’ అన్న ‘ట్యాగ్‌లైన్’ ఉంటేనే దగ్గరుండి, దరఖాస్తును ఆన్‌లైన్ ‘చేస్తున్నారు’. లేకుంటే, సర్వర్ సమస్య అంటూ తిప్పి పంపుతున్నారు.
ఉన్న సమయమే తక్కువ..
అందునా వరుస సెలవులు
కొత్తగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల మంజూరు కోసం ఈ నెల 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వ ఆదేశాలతో గ్రామ, వార్డు స్వర్ణ సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం విదితమే. పింఛను లబ్ధి పొందేందుకు వేలాది మంది దరఖాస్తులు పట్టుకుని, ప్రతి రోజూ ఆయా కార్యాలయాల వద్ద బారులు తీరుతున్నారు. ఉన్న సమయమే తక్కువ. అందులోనూ వరుసగాసెలవు దినాలు రెండో శనివారం, ఆదివారం, సోమవారం(వినాయక చవితి) వస్తున్నాయి. ఒకవైపు అవసరమైన అర్హత పత్రాల కోసం తిరుగుతూ, ఆందోళన చెందుతున్న దరఖాస్తుదారులు ఒక్కసారిగా సచివాలయాలకు క్యూ కడుతున్నారు. అక్కడ వారికి సర్వర్ సమస్య వేధిస్తోంది. గంటలకొద్దీ వేచి ఉంటున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. మరోవైపు అసలు అర్హతలు కంటే.. ‘తమ్ముళ్ల’ సిఫారసే ప్రధాన అర్హతగా మారింది. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలే సచివాలయాల్లో దగ్గరుండి తమ వారి పేర్లకే ‘అనుమతి’ ఇస్తున్నారు. కురుపాం సచివాలయం–2లో డిజిటల్ అసిస్టెంట్ కాదు కుర్చీలో తెలుగుదేశం పార్టీకి చెందిన కాార్యకర్త దర్జాగా కుర్చీలో కూర్చొని తతంగాన్ని నడపడం చర్చనీయాంశంగా మారింది. ఆయన అంతా చేస్తుంటే.. పక్కనే సిబ్బంది చేతులు కట్టుకుని నిల్చోవడం గమనార్హం. జిల్లాలో దాదాపు అన్ని చోట్లా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ‘ఈ తాత మనోడేనా? టీడీపీ జెండా మోశా డా? అయితేనే దరఖాస్తు అప్‌లోడ్ చేయు.. ఈ అవ్వ మన పార్టీకి ఓటెయ్యలేదా? అయితే సైట్ ‘సర్వర్ ఎర్రర్’ అని చూపించు, దరఖాస్తును పక్క న పెట్టేయ్’ అని అనధికార ఆదేశాలిచ్చేస్తున్నారు. పింఛన్ల కోసమని వస్తున్న దరఖాస్తుదారులకు అక్కడ ఏకంగా సచివాలయాలకు బదులు ‘పచ్చ పార్టీ బ్రాంచ్ ఆఫీస్’లు కనిపిస్తున్నాయి. అర్హుల జాబితా తయారయ్యేసరికి... పచ్చ కండువా కప్పుకున్న వాళ్లకు మాత్రమే పింఛన్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అధికార దర్పంతో వ్యవస్థలనే ‘తెలుగు తమ్ముళ్లు’ హైజాక్ చేస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
కురుపాం–2 సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ సీట్లో కూర్చొని పింఛన్ దరఖాస్తులు అప్‌లోడ్ చేస్తున్న టీడీపీ ఉత్తమ కార్యకర్త సుఖేష్ చంద్ర పండా
సుఖేష్ చంద్రపండాకు ఉత్తమ కార్యకర్తగా
నారా లోకేశ్ ఇచ్చిన ప్రశంసా పత్రం


