● జోన్ విశాఖలో.. కష్టాలు మాత్రం పట్టాలపైనే
● విశాఖ–విజయనగరం–బొబ్బిలి–పార్వతీపురం మార్గాల్లో ప్రయాణికుల అవస్థలు
సాక్షి, పార్వతీపురం మన్యం : ఎప్పుడో వస్తుందని ఎదురుచూసిన రైల్వే జోన్ వచ్చింది. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. పాత వాల్తేర్ డివిజన్‌న్ స్థానంలో విశాఖ డివిజన్ ఏర్పడింది. దశాబ్దాల కల సాకారమైందన్న ఆనందం ఉత్తరాంధ్రలో వ్యక్తమైంది. జోన్ వచ్చిన తర్వాత తమ రైలు కష్టాలు తీరకపోగా.. మరింత పెరిగాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖ–విజయనగరం–బొబ్బిలి–పార్వతీపురం–రాయగడ మార్గాల్లో రోజువారీ ప్రయాణాలు చేసే ఉద్యోగులు, విద్యార్థులు, చిరు వ్యాపారులు, సాధారణ ప్రయాణికులకు ఇబ్బందులు కొనసాగుతున్నాయని చెబుతున్నారు. జోన్ రావడంతో పరిపాలనా వ్యవస్థ మారింది గానీ.. స్థానిక ప్రయాణికుడికి అవసరమైన రైలు సౌకర్యాలు మాత్రం ఆశించిన స్థాయిలో పెరగలేదన్నది వారి ప్రధాన వాదన.
గంటలకొద్దీ ఆలస్యం..
పట్టాలపైనే సగ జీవితం
ఇదీ.. నిత్యం విశాఖ నుంచి విజయనగరం మీదుగా పార్వతీపురం మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు, ఉద్యోగుల వాదన.. ఆవేదన. విశాఖ నుంచి పార్వతీపురం వైపు ప్రస్తుతం పలు రైళ్లు నడుస్తున్నాయి. ఉన్నవే స్వల్ప సంఖ్యలో రైళ్లు. అందులో ఏ ఒక్కటీ సమయానికి రాదు.. సకాలంలో గమ్యస్థానం చేర్చదు. మరోవైపు జోన్ ప్రారంభం మొదలు.. సరకు రవాణా గూడ్స్ సర్వీసులు అధికమయ్యాయి. ఇవి ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. విజయనగరం నుంచి పార్వతీపురం మధ్యలో ఏ స్టేషన్‌లో చూసినా నాలుగైదు గూడ్స్ రైళ్లు ఆగిపోతూనే ఉంటున్నాయి. ఈ లైన్లు క్లియరెన్స్ లేక పాసింజర్, ఎక్స్‌ప్రెస్ సర్వీసులన్న తేడా లేకుండా గంటలకొద్దీ ఆగిపోతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులకు, విద్యార్థులకు, వ్యాపారులకు ఉపయోగకరంగా ఉండే డీఎంయూ రైలు ఉదయం విశాఖలో 6.45 నిమిషాలకు బయల్దేరాల్సి ఉంది. దీనికంటూ ఒక సమయం ఉండటం లేదు. 9.35 నిమిషాలకు పార్వతీపురం చేరుకోవాల్సి ఉన్నా.. ఉదయం 11, మధ్యాహ్నం 12 అయినా ఒక్కోసారి చేరుకోవడం లేదు. సాధారణంగా విజయనగరం నుంచి పార్వతీపురానికి గంట నుంచి గంటన్నర సమయం కాగా.. రైళ్లు ఎక్కడికక్కడ ఆగిపోవడం వల్ల మూడు గంటలకుపైగా పడుతోంది. రాయగడ నుంచి వచ్చే రాయిపూర్ పాసింజర్, భవానీపట్నం, గుంటూరు–రాయగడ ఎక్స్‌ప్రెస్ సర్వీసులన్నింటిదీ ఇదే పరిస్థితి. జోన్ వస్తే కొత్తవలస నుంచి విజయనగరం మీదుగా రాయగడ.. విజయనగరం నుంచి చీపురుపల్లి, పొందూరు, ఇచ్ఛాపురం వరకు రైలు మార్గాలు మెరుగుపడతాయని అంతా భావించారు. ఇప్పటికే కొత్తవలస నుంచి విజయనగరం వరకు నాలుగో లైను, విజయనగరం నుంచి రాయగడ వైపు మూడో లైను పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. శ్రీకాకుళం వెళ్లే మార్గంలో ప్రధాన ఇబ్బందులు ఏమీ లేనప్పటికీ.. విజయనగరం, పార్వతీపురం, రాయగడ మార్గంలోనే ప్రయాణం నరకంగా మారుతోందని ప్రయాణికులు అంటున్నారు. రాయగడ వైపు నుంచి వచ్చే ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ సర్వీసులు సైతం గంటలకొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి. దీనివల్ల అత్యవసర పనుల మీద వెళ్లేవారు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జోన్ వచ్చిన తర్వాత కొత్త రైళ్లు రాకపోగా.. నిత్యం తిరిగే డీఎంయూ వంటి రైలును వారానికి ఒకసారి నిలుపు చేయడం కొసమెరుపు. పరిపాలనా పటంలో గీతలు మారడం కంటే.. ప్రయాణికుడి జీవితంలో మార్పు రావడమే అసలు జోన్ విజయానికి కొలమానం అని ప్రయాణికులు చెబుతున్నారు. ‘జోన్ వచ్చింది.. ఇక మా రైలు కష్టాలు ఎప్పుడు తీరుతాయి?’ అని నిత్యం ఈ మార్గంలో వెళ్లి వచ్చే ప్రయాణికులు అంటున్నారు.


