● శివరాంపురం జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించిన కలెక్టర్
● అధికారుల తీరుపై అసహనం
సాలూరు: కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి విద్యార్థిగా మారి వారి బెంచీల్లో కూర్చొని పాఠాలను స్వయంగా ఆలకించారు. విద్యార్థులకు అందుతున్న విద్య నాణ్యత, బోధనా పద్ధతులను స్వయంగా పరిశీలించారు. వివరాల్లోకి వెళ్తే.. కలెక్టర్ ప్రభాకరరెడ్డి మండలంలోని శివరాంపురం జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఉపాధ్యాయులకు గురు పూజోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. తరగతి గదిలోకి వెళ్లి సాధారణ విద్యార్థిలా బెంచీపై కూర్చొని మన్యం ఇంగ్లిష్, డిజిటల్ స్మార్ట్ తరగతి పాఠాలను ఆసక్తిగా విన్నారు. ఆంగ్ల భాషలో పట్టు సాధించాలని విద్యార్థులకు సూచించారు. కిశోర బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై స్పష్టమైన అవగాహన కల్పించాలని హెచ్‌ఎం, ఉపాధ్యాయులకు సూచించారు.
అధికారుల తీరుపై అసహనం
శివరాంపురం గ్రామానికి సంబంధించి శాఖల వారీగా ప్రభుత్వ కార్యక్రమాల వివరాలను అధికారులు వివరించలేకపోవడంపై కలెక్టర్ ప్రభాకరరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల వివరాలు అధికారుల వద్దే లేవంటే ఏం పని చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూన ముఖ్యంగా అధికారులు మనమిత్ర యాప్‌పై అవగాహన పెంపొందించుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట నియోజకవర్గ ప్రత్యేకాధికారి కె.రామచంద్రరావు, ఎంపీడీఓ పార్వతి, పలు శాఖల అధికారులు ఉన్నారు.


