ప్రతి రోజూ సాయంత్రం నాలుగు గంటలైందంటే చాలు.. పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ రణరంగాన్ని తలపిస్తోంది. బస్సు ఎప్పుడు వస్తుందా..! అన్న నిరీక్షణ.. తీరా వచ్చాక.. సీటు దొరుకుతుందో లేదో.. అన్న ఉత్కంఠ ప్రయాణికులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ‘సీ్త్రశక్తి’ పథకం నేపథ్యంలో బస్సులన్నీ కిక్కిరిసిపోతుండగా.. సీటు దక్కించుకునేందుకు ప్రయాణికులు సర్వశక్తులూ ఒడ్డి సాగిస్తున్న కుస్తీలు అన్నీఇన్నీ కావు. బస్సు ఆగకుండానే లోపలికి చొరబడేందుకు వారు పడుతున్న ఆరాటం వర్ణనాతీతం. బస్సు లోపల ఇసుకవేస్తే రాలనంత జనం.. పొరపాటున సీటు దొరక్కపోతే డోర్ల వద్ద ప్రమాదకరంగా వేలాడుతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిందే. బస్సులోకి ఎక్కే ఈ తోపులాటలో నెగ్గలేని వృద్ధులు, బలహీనులు చేసేది లేక తదుపరి బస్సు కోసం పడిగాపులు కాయాల్సిన దుస్థితి. ఒకవేళ తమ ఊరికి అదే ఆఖరి బస్సు అయితే మాత్రం, భయాన్ని గుండెల్లో దాచుకుని అపాయం అంచున వేలాడుతూ గమ్యం చేరుకోవాల్సిన దుస్థితి ఇక్కడ నిత్యకృత్యమైంది. – పార్వతీపురం రూరల్


